Congress President Election: ఆ పదవికి మల్లికార్జున ఖర్గే రాజీనామా, ఒకే వ్యక్తి ఒకే పదవి నిబంధనలో భాగంగానే రిజైన్
Congress President Election: రాజ్యసభ ప్రతిపక్ష నేత హోదా నుంచి మల్లికార్జున్ ఖర్గే తప్పుకున్నారు.
Congress President Election:
ఖర్గే ఎన్నిక లాంఛనమేనా..?
ఒకే వ్యక్తి ఒకే పదవి నిబంధన అమల్లో భాగంగా...మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే...రాజ్యసభలోని ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకున్నారు. ప్రెసిడెంట్ రేస్‌లో...ఖర్గేతో పాటు శశిథరూక్ కూడా ఉన్నారు. అయితే...ఖర్గే ఎన్నిక లాంఛనమే అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదికి చెందిన వాడు అవటంతో పాటు సామాజిక వర్గం అనే కోణంలోనూ...ఖర్గేకు అధిష్ఠానం ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. G-23లోని పృథ్విరాజ్ చావన్, మనీష్ తివారీ ఇప్పటికే...ఖర్గేకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. మరికొందరు నేతలు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పెద్ద మార్పు కోసమే తాను పోరాడుతున్నానని, ప్రతినిధులందరూ తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
" ఈ రోజు నాకు మద్దతుగా వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులంతా నన్ను ప్రోత్సహించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. అక్టోబర్ 17న ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. నేను గెలుస్తానని ఆశిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ భావజాలంతో ముడిపడి ఉన్నాను. నేను 8, 9 తరగతుల్లో ఉన్నప్పుడు గాంధీ, నెహ్రూ సిద్ధాంతాల కోసం ప్రచారం చేశాను. "
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత
ఖర్గేకు మద్దతు..
ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక్ గహ్లోత్, దిగ్విజయ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఎకె ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ప్రతిపాదించారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అంతకుముందు నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎవరికీ పోటీగా బరిలోకి దిగలేదని పార్టీపై ప్రేమతోనే ఇది చేస్తున్నట్లు శశి థరూర్ అన్నారు.
" పార్టీ అధికారికంగా ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించలేదు. గాంధీ కుటుంబం ఈ రేసులో తటస్థంగా ఉంటుందని, వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులను తాము స్వాగతిస్తామని కాంగ్రెస్ అధినేత్రి నాకు హామీ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇది ఎవరినీ అగౌరవపరచడం కాదు. స్నేహపూర్వక పోటీ. మేము ప్రత్యర్థులం కాదు. మేం ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేసిన నేతలం. మల్లికార్జున్ ఖర్గే మా పార్టీకి 'భీష్మ పితామహుడు'. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకోనివ్వండి. ఖర్గే, దిగ్విజయ్ సింగ్, త్రిపాఠి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడను. "
-శశి థరూర్, కాంగ్రెస్ నేత
ఝూర్ఖండ్‌కు చెందిన సీనియర్ నేత కేఎన్ త్రిపాఠీ కూడా పార్టీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. ఆయన మాజీ మంత్రి. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.. జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు.