(Source: ECI/ABP News/ABP Majha)
Chhattisgarh Congress: ఛత్తీస్ గఢ్ లో 'చదరంగం'.. అధిష్ఠానానికి శిరోభారం
ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ అన్నారు. తనకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు.
ఛత్తీస్ గఢ్ రాజకీయం వేడెక్కింది. సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ఎవరి వాదన వారు వినిపించేందుకు ఇరువురు నాయకులు దిల్లీకి చేరుకున్నారు. అయితే ఈ సందర్బంగా ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రంగా ఉందని.. తమకు మూడొంతుల మెజారిటీ ఉందన్నారు.
Chhattisgarh CM Bhupesh Baghel arrives in Delhi, says, "There may be a meeting with Rahul Gandhi ji today. The Congress government in Chhattisgarh is safe with 3/4th majority, we have 70 MLAs ." pic.twitter.com/CthSzYQr0q
— ANI (@ANI) August 27, 2021
తన బలాన్ని నిరూపించుకునేందుకు బఘేల్.. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. రాహుల్ గాంధీతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. తనకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బఘేల్ మీడియాకు తెలిపారు.
పార్టీ అధిష్ఠానాన్ని కలవాలని తనకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నుంచి సందేశం వచ్చిందని బఘేల్ అన్నారు.
అధికార మార్పిడి ఉందా..?
ఛత్తీస్‌గఢ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఓవైపు భూపేశ్ బఘేల్, మరోవైపు సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. చివరకు రొటేషనల్ ఫార్ములాలో ఇద్దరినీ సీఎంగా చేసేందుకు అధిష్ఠానం అంగీకరించింది.
తొలి రెండున్నర ఏళ్లు భూపేశ్ బఘేల్‌ను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని సూచించింది. అందుకు అనుగుణంగానే అధికార పగ్గాలు చేపట్టిన భూపేశ్ బఘేల్.. ఈ ఏడాది జూన్ 17 నాటికి 2.5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో ముందస్తుగా అనుకున్న ప్రకారం, డియోకు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి.
ఒకదాని తర్వాత ఒకటి..
అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోగా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ని అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ కూడా ఆ జాబితాలో చేరింది.