Communists Independence : " యే అజాది రియల్ హై" ...75 ఏళ్లకు తెలివి ! తొలి సారి జెండా పండుగ జరుపుతున్న కమ్యూనిస్టులు..!
దేశానికి వచ్చింది బూర్జువా స్వాతంత్య్రంగా భావించే కమ్యూనిస్టులు జెండా పండుగకు దూరంగా ఉంటారు. ఈ సారి స్వాతంత్య్రం వచ్చిందని నమ్ముతున్నారు. అధికారికంగా జెండా పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించారు.
"యే ఆజాది ఝూటీ హై"
ఇది 1948లో అంటే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం. అంటే ఈ స్వాతంత్రం బూటకం అనేది వారి నమ్మకం. దానికి తగ్గట్లుగానే దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు చేసుకుని ఊరూవాడా జాతీయ జెండాను ఎగుర వేస్తూంటే.. కమ్యూనిస్టులు మాత్రం ఇంకా స్వాతంత్ర్యం రాలేదన్న భావనతో జెండా పండుగకు దూరంగా ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఐ మావోయిస్టు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, జనశక్తి, ప్రతిఘటన ఇలా ఇలా ఎన్నో పార్టీలు ఏర్పడ్డాయి. ఈ పార్టీలేవీ.. తమ పార్టీ కార్యాలయాల ముందు జాతీయ జెండాను ఆవిష్కరించవు. ఈ పార్టీల దృష్టిలో భారతదేశానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదు. బ్రిటీష్ వారి నుంచి కేవలం అధికార మార్పిడిలో భాగంగా ఈ దేశానికి చెందిన వారు పాలిస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకూ వారు ఎప్పుడూ అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేయలేదు. అయితే ప్రజాప్రతినిధులుగాఎన్నికైన వారు... ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చోట మాత్రం ఎప్పుడూ జాతీయ జెండాను పార్టీ విధానంతో సంబంధం లేకుండా ఆవిష్కరిస్తూనే వస్తున్నారు.
పార్టీ పరంగా ఎప్పుడూ పిలుపునివ్వలేదు. కానీ ఈ ఏడాది మాత్రం మనసు మార్చుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అంగీకరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న రోజున కమ్యూనిస్టులు కూడా స్వాతంత్ర్యం వచ్చిందని అంగీకరించారు. జెండా పండగను తమ పార్టీ అధికారింగా నిర్వహిస్తుందని ప్రకటించారు. 1964 లో సీపీఎం ఆవిర్భవించిన నాటి నుంచి అధికారికంగా పంద్రాగస్టు నాడు పార్టీ కార్యాలయాల్లో జెండా పండుగ జరపాలని ఎప్పుడూ సూచించలేదు. అలాంటిది మొదటిసారి దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ‘ఐడియా ఆఫ్ ఇండియా’ అలాగే ఆధునిక భారతదేశ నిర్మాణంలో సీపీఎం సహకారం, స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులతో ఆర్ఎస్ఎస్ అంటకాగిన విధానం, రిపబ్లిక్ ఇండియాలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం అణచివేత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఆలోచన అని సీపీఎం చెబుతోంది.
కారణం ఏదైనా కానీ ఇంత కాలం జాతీయ జెండాపై నిరాసక్తి వ్యక్తంచేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు అధికారికంగా జెండాపండుగ చేసుకుంటున్నారు.ఇది స్పష్టంగా వచ్చిన మార్పు. ఈ మార్పునకు కారణం ఆ పార్టీ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితి కావొచ్చు. దేశంలో ఇప్పడు ఒక్క కేరళలో తప్ప మరెక్కా కమ్యూనిస్టులు ఉనికి చూపించే పరిస్థితుల్లో లేరు. దశాబ్దాలపాటు పరిపాలించిన బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మరో వైపు దేశంలో ప్రజల్లో పెరుగుతున్న జాతీయత భావం .. కమ్యూనిస్టుల భావజాలం దానికి విరుద్ధంగా ఉండటం వంటి కారణాల వల్ల ఇప్పుడు సీపీఎం మనసు మార్చుకుంటుంది. అంటే ఇంత కాలనికి కమ్యూనిస్టులు భారత్‌కు వచ్చిన స్వాతంత్య్రాన్ని "యే ఆజాది ఝూటీ హై" గా కాకుండా యే ఆజాదీ రియల్ హై అని నమ్ముతున్నారు. 75 ఏళ్లకు కమ్యూనిస్టులకు ఈ నమ్మకం కలిగిందన్నమాట.