Water dispute Committee: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కమిటీ -హఠాత్తుగా కేంద్రం కీలక నిర్ణయం
Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ మధ్య తరచూ వస్తున్న జల వివాదాలు, ప్రాజెక్టుల అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.

Water issues between Andhra Pradesh and Telangana: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ , ప్రాజెక్టుల నిర్వహణపై తలెత్తుతున్న విభేదాలను సాంకేతిక, పరిపాలనాపరంగా పరిష్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ కమిటీలో నీటి వనరుల రంగానికి చెందిన కీలక అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. కృష్ణా , గోదావరి నదీ యాజమాన్య బోర్డులు KRMB, GRMB ఛైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చీఫ్ ఇంజినీర్, అలాగే సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన ఉన్నతాధికారులను కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేశారు. వివాదాస్పద ప్రాజెక్టులు , నీటి పంపకాలపై ఈ కమిటీ ఇచ్చే నివేదిక రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలను ముగించడానికి మార్గం చూపనుంది.
ఎవరెవరు ఉంటారంటే ?
ఈ కమిటీకి కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నాయకత్వం వహిస్తారు. ఇందులో కీలక బాధ్యతలు నిర్వహించేందుకు ఇరు రాష్ట్రాలు. కేంద్రానికి చెందిన ప్రతినిధులను సభ్యులుగా నియమించారు. రాష్ట్రాల ప్రతినిధులు: తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు , కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఛైర్మన్లు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (NWDA) చీఫ్ ఇంజినీర్ , సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కి చెందిన చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉంటారు.
కమిటీ ప్రధాన లక్ష్యాలు
ఈ కమిటీ ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నికర పంపిణీ, శ్రీశైలం , నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల బదిలీ వంటి అంశాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ , పోలవరం వంటి వివాదాస్పద అంశాలపై సాంకేతిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
ప్రాధాన్యత, పర్యవసానాలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో ట్రిబ్యునళ్లలో విచారణలు ఏళ్ల తరబడి సాగగా, ఇప్పుడు ఈ సాంకేతిక కమిటీ ద్వారా త్వరితగతిన సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, గోదావరి బోర్డు కార్యాలయాన్ని తెలంగాణకు తరలించే ప్రక్రియపై కూడా ఈ కమిటీ సమన్వయం చేయనుంది. ఈ కమిటీ నిర్ణయాలు రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేకూర్చడంతో పాటు, అనవసరమైన రాజకీయ ఘర్షణలను తగ్గించగలవని కేంద్రం ఆశిస్తోంది.





















