Jagan Simla Tour : యూరప్ కాదు సిమ్లాకు ఏపీ సీఎం జగన్ టూర్..!
సీఎం జగన్ యూరప్ పర్యటనకు వెళ్లడం లేదు. ఆయన హిమాచల్ ప్రదేశ్ టూర్‌కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల సిమ్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో గడపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్‌కు వెళ్లడం లేదు. సీబీఐ కోర్టు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. బెయిల్ పై ఉన్న ఆయనకు డిప్లమాటిక్ పాస్‌పోర్టు ఉన్నప్పటికీ బెయిల్ షరతుల ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోసం కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని తేలిపోయింది. అయితే ఆయన టూర్‌కు వెళ్లడం మాత్రం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వ్యక్తిగత పర్యటన కావడంతో పూర్తి వివరాలు చెప్పడానికి అధికార వర్గాలు సిద్ధపడటం లేదు.
ఆయన కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నట్లుగా మాత్రం చెబుతున్నారు. ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే గురువారం ఆయన వెళ్తారని మళ్లీ ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తారని చెబుతున్నారు. ఆగస్టు 28వ తేదీ సీఎం జగన్ - భారతీల వివాహ వార్షికోత్సవం. ఈ సారి వివాహ వార్షికోత్సవానికి ఓ ప్రత్యేక ఉంది. వారి పెళ్లి అయి ఇరవై ఐదేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు ప్రత్యేకంగా వేడుకలు చేసుకోవాలనుకుంటున్నారని అందుకే... హాలీడే ట్రిప్‌కు వెళ్లాలని అనుకున్నారని అంటున్నారు. కరోనా సమయంలో విదేశాలకు అంటే కష్టం కాబట్టి... దేశంలోనే మంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలను ఎంచుకున్నారని అంటున్నారు. వాటితో పాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను కుటుంబసభ్యులతో కలిసి చూసి తిరిగి తిరిగి వస్తారని తెలుస్తోంది. ఐదు రోజుల తరవాత మళ్లీ సెప్టెంబర్ ఒకటో తేదీన జగన్ అమరావతికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఓ సారి జెరూసలెం.. మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ రెండూ వ్యక్తిగత పర్యటనలే. ఎన్నికల్లో గెలిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు కుటుంబ సమేతంగా జెరూసలెం వెళ్లారు. చిన్నకుమార్తెను అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లారు. రెండూ వ్యక్తిగత పర్యటనలే. అయితే అమెరికా వెళ్లినప్పుడు మాత్రం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటనలకు ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడే వెళ్తున్నారు. పెట్టుబడుల కోసం గతంలో ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వెళ్లేవారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత కరోనా కారణంగా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆయన పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేయలేకపోయారు.





















