Chittoor News: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నిరసన సెగ - గ్రామానికి రావద్దంటూ కంచె
Chittoor News: నెల్లూరు జిల్లా గుంటిపల్లి గ్రామస్థులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తమ గ్రామంలోకి రానివ్వలేరు. కంచె వేసి మరీ ఆయనను అడ్డుకున్నారు.
Chittoor News: వైసీపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వైసీపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు చాలా గ్రామాల్లో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. తమ గ్రామానికి రావద్దంటూ మంత్రులను, ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తం అనేక ప్రాంతాల్లో జరుగుతూనే ఉంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఎమ్మెల్యేలకు ఎదురైంది కానీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సొంత ఇలాకాలోనే మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అధికార పార్టీ నేతలే తమ గ్రామానికి రావద్దంటూ గ్రామ శివారులో రాళ్లు, ముళ్ల కంపలను వేసి అడ్డుకున్న ఘటన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గుంటిపల్లిలో శనివారం ఉదయం వెళ్లారు. అయితే ఆయన వస్తున్నట్లుగా ముందుగానే తెలుసుకున్న గ్రామస్థులు గ్రామ శివారులో మళ్ల కంపలు, రాళ్లు అడ్డుపెట్టారు. లోపలికి రానివ్వమంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా వైసీపీ జెండాలను కట్టి తాము పార్టికి అధినేత అభిమానులమే కానీ.. నారాయణ స్వామి అభిమానులం కాదని చెప్పారు. తమ గ్రామస్థులు సమస్యలు అంటూ వస్తే ఏమాత్రం పట్టించుకోకుండా, ఇప్పుడెందుకు వస్తారని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ తమ గ్రామం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు.
ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేందర్ రెడ్డే తమకు కావాలని, తామంతా ఆయన పక్షానే వైసీపీ పార్టీలో కొనసాగుతామని తేల్చి చెప్పారు. గత కొద్ది కాలంగా గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో చాపకింద నీరులా గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ తమకు ఏం చేయలేదనే అసంతృప్తి చాలా మందిలో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది నాయకులు గ్రూపులుగా విడిపోయిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి గ్రామాల ప్రజల నుండి నిరసన సెగ వస్తున్నట్లు తెలుస్తుంది.