Controversy Chinna jeeyar : ఇదేంది స్వామీ ? చెప్పే ప్రవచనాలు కూడా వివాదాలేనా ?
కార్పొరేట్ స్వామిజీగా విమర్శలు ఎదుర్కొనే చిన్నజీయర్ స్వామి ఇప్పుడు ప్రవచనాల్లోనూ వివాదాలు సృష్టిస్తున్నారు. పాత వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
చినజీయర్ స్వామి. ఇటీవలి కాలంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన ఆధ్యాత్మి స్వామి. రాజకీయ నాయకులతో ఆయన సంబంధాలు.. ఆయన వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన ప్రసంగాలు కూడా అంతే. ఇప్పుడు సమ్మక్క- సారక్కలపై అనుచిత వ్యాఖ్యలతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. ఆ వ్యాఖ్యలు ఎప్పుడో చూసి ఉండవచ్చు..కానీ అలాంటివి చేయడం మొదటి సారి కాదు. అందుకే ఈ సారి ఆయనపై ఎప్పుడూ లేనన్ని విమర్శలు వస్తున్నాయి.
మాంసాహారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ !
అధ్యాత్మిక వేత్తగా చినజీయర్ ప్రవచనలు చెబుతూంటారు. ఇటీవల ఆయన ప్రజల ఆహారపుటలవాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసాహారులు ఏ జంతువును ఆహారంగా తీసుకుంటారో ఆ జంతువులా ప్రవర్తిస్తారన్నారు. పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుక తింటారని ఆయన ఉదాహరణలతో సహా చెప్పారు. ఈ విషయం దుమారం రేపింది. ప్రజల ఆహారపుటలవాట్లను ప్రశ్నించడానికి ఆయనెవరని పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశాయి. అయితే తర్వతా ఆ వివాదం సద్దుమణింగి.
కులాలు ఉండాలని వ్యాఖ్యలు !
సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కస్తున్న సమయంలో కులాల గురించి వ్యాఖ్యలు చేసారు. కులాలను నిర్మూలించకూడదని, ఎవరి కుల వృత్తిని వారు కొనసాగించాలని ఓ సందర్భంలో ప్రవచించారు. అసలు కుల, మతాలు లేని సమానత్వాన్ని బోధిస్తూ సమతావిగ్రహం పెడుతూ.. కులాలు ఉండాలని చినజీయర్ చెప్పడేమింటని విమర్శలు వెల్లువెత్తాయి. చినజీయర్ పలికిన మాటలు మధ్య యుగం కాలంలో చెల్లుబాటు అయ్యాయన్న విమర్శలు వచ్చాయి.
గతంలో తిరుమలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు !
తిరుపతికి వెళుతుంటే ఓ క్లబ్‌కు వెళుతున్నట్టుగా ఓ భావన కలుగుతుందంటూ గతంలో ఓ సారి చినజీయర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రోమ్ నగరాన్ని సందర్శనకు వెళ్లితే రోమ్ సంస్కృతి ఉట్టిపడినట్టుగా ఓ భావన కలుగుతుందని, కానీ తిరుపతికి వెళితే ఓ క్లబ్‌కు వెళుతున్నామనే భావన కలుగుతుందంటూ భక్తి కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన అగ్రహానికి కారణం గతంలో కొండపై తాను అనుకున్నట్లుగా వ్యవహరించలేదని.. తన పెత్తనానికి అంగీకరించలేదన్న కారణంగా అలాంటి వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలపై విమర్శలు !
చినజీయర్ స్వామి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తంలో పెద్దగా పరిచయం అవసరం లేని ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. నిజానికి అనేక దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, రాజకీయ, సామాజిక రంగాలలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అలాగే, ఆయన చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి, వివాదాస్పద రాజకీయ స్వామీజీగా వ్యవహరించారనే ఆరోపణలూ ఉన్నాయి. చిన జీయర్ స్వామి.. సర్కార్ స్వామిగానూ విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదుర్కుంటున్నారు. ఆయన చేపట్టే కార్యక్రమాల వెనుక కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాలు ఉంటాయని సీపీఐ నేత నారాయణ లాంటి వారు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు.
నిజానికి ఆయన ఇప్పటి వరకూ మాట్లాడిన మాటలపై పెద్దగాఎవరూ వివాదం చేయలేదు. కానీ ఇటీవల మాత్రం ఎవరూ ఊరుకోవడం లేదు. ఆయన మాటలపై నిరసనలు ప్రారంభిస్తున్నారు. దీంతో మరింత వివాదాస్పదం అవుతున్నారు.