China president: టిబెట్ లో జిన్ పింగ్ రహస్య పర్యటన.. కారణమిదే!
గల్వాన్ ఘటన తర్వాత చైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టిబెట్ ను తన అధీనంలోకి తెచ్చుకున్న చైనా అక్కడ ఎలాగైనా తన పాలనకు ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలని కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది.
భారత్‌తో ఘర్షణ తర్వాత చైనా.. టిబెట్లో వేగంగా మార్పులు చేర్పులు చేస్తోంది. వీలైనంత తొందరగా అక్కడి ప్రజల్లోని అసంతృప్తిని చల్లార్చి పూర్తిగా తన గుప్పిట బంధించేలా ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్ తొలిసారి టిబెట్‌ను సందర్శించారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న జిన్‌పింగ్ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పర్యటించకపోవడం గమనార్హం.
చైనాలో షింజియాంగ్ తర్వాత వివాదాస్పద ప్రాంతం టిబెట్ కావడం విశేషం. జిన్‌పింగ్ పర్యటన విశేషాలను చైనా అధికార ఛానల్ సీసీ టీవీ శుక్రవారం ప్రసారం చేసింది. టిబెట్‌లోని నియంజి మెయిన్లింగ్ విమానాశ్రయంలో జిన్‌పింగ్ అడుగు పెట్టగానే సంప్రదాయ దుస్తుల్లో ఉన్న స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన నయాంగ్ నది వంతెనను పరిశీలించారు. 1990లో జియాంగ్ జెమిన్ తర్వాత ఒక చైనా అధ్యక్షుడు ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. షీ జిన్‌పింగ్ 1998, 2011లో టిబెట్‌కు వచ్చారు. కానీ, అప్పుడు ఆయన అధ్యక్షుడు కాదు.
అంతా రహస్యంగా..
జిన్‌పింగ్ పర్యటనను మీడియా అత్యంత రహస్యంగా ఉంచింది. ఆయన పర్యటన బుధవారం మొదలుకాగా..ఆ కార్యక్రమాలను శుక్రవారం ప్రసారం చేశారు. గురువారం లాసాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్నేషనల్ క్యాంపైన్ ఫర్ టిబెట్ సంస్థ పేర్కొంది. గురువారం జిన్‌పింగ్ అక్కడి సిచువాన్-టిబెట్ రైల్వేస్టేషన్, సిటీ ప్లానింగ్ మ్యూజియం సందర్శించి అధికారులతో అభివృద్ధిపై చర్చించారు.
తమ సంస్కృతిపై వివక్ష చూపుతున్నారని 2011లో టిబెట్‌లో అల్లర్లు జరిగాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరో షింజియాంగ్ ప్రావిన్స్ వలే మారుతుందనే భయాలు చైనాలో ఉన్నాయి. అందుకే ఇక్కడి సంస్కృతిని మెల్లగా రూపుమాపి చైనా ప్రధాన భూభాగంలోని సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టేలా వ్యూహం పన్నారు. దీనిలో భాగంగా 146 బిలియన్ డాలర్లను వెచ్చించి అక్కడ భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. సిచువాన్-టిబెట్ రైల్ లింక్ ప్రాజెక్టు, టిబెట్-నేపాల్ రైలు ప్రాజెక్టు, భారీ డ్రైపోర్టు నిర్మాణం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇవే కాకుండా పలు అభివృద్ధి పథకాలు కూడా మొదలుపెట్టింది చైనా. టిబెట్ సరిహద్దులోని మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్.. అటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువగా వస్తోంది.
టిబెట్ వాసుల మాతృభాషను తుడిచిపెట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. 2002లో టిబెట్ మాతృభాషతో సమానంగా మాండరీన్ కూడా నేర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత మెల్లగా టిబెట్ మాతృభాష తరగతులను పక్కనపెట్టి మాండరీన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్ల గతేడాది హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది. 2017 నాటికి మొత్తం టిబెట్ ప్రాంతంలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. కేవలం ఒక తరగతి టిబెట్ భాషలో చెప్పి.. మిగిలిన తరగతులు మాండరీన్లో చెబుతున్నారు. 2018లో టిబెట్ వాసులు ఎక్కువగా ఉండే క్వింగ్‌హై ప్రావిన్స్‌లో పూర్తిగా మండరీన్‌లో బోధించడం మొదలుపెట్టడంపై ఆందోళనలు చోటు చేసుకొన్నాయి. దీంతో ఆగ్రహించిన చైనా ఒక ఉద్యమకారుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆ భయాలతో..
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (85) వారసుడి ఎంపిక విషయమై చైనా గతేడాది మే నెలలో శ్వేతపత్రం విడుదల చేసింది. "1951 నుంచీ టిబెట్.. దాని విమోచనం, అభివృద్ధి.. శ్రేయస్సు" అంటూ దీనికి పేరు కూడా పెట్టారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడు ఎవరైనా తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని, అలాకాకుండా వారి ఇష్టానుసారం ఎవరో ఒకరిని వారసుడిగా నియమిస్తే గుర్తించబోమని ఇప్పటికే చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ఎంపికలో కీలకమైన పంచయిన్ లామాను చైనా చెప్పుచేతల్లో పెట్టుకొంది. గతేడాది ఏడాది మేలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి 11వ పంచయిన్ లామ గెధున్ చొయికి నైమా క్షేమ సమాచారం వెల్లడించారు. "బాలుడిగా ఉన్నప్పుడు అతడికి తప్పనిసరి విద్యను అందించాం. ఇప్పుడు ఆ యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఉద్యోగం కూడా లభించింది. 31ఏళ్ల అతడు గానీ.. అతడి కుటుంబం గానీ ప్రస్తుతం ఉన్న ప్రశాంత పరిస్థితులను వదులుకోవాలనుకోవడం లేదు" అని పేర్కొన్నారు. టిబెట్‌లో 10వ పంచయిన్ లామా వారసుడిగా గుర్తింపు పొందిన ఆరేళ్ల బాలుడు గెధున్ చొయికి నైమాను సరిగ్గా 25 ఏళ్ల క్రితం చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతడి ఆచూకీ ఎవరికీ తెలియదు