China Covid Deaths: కొవిడ్ మరణాలపై ఈ వివరాలు సరిపోవు, మరింత సమాచారం ఇవ్వండి - చైనాతో WHO
China Covid Deaths: చైనాలో కొవిడ్ మరణాలపై మరిన్ని వివరాలు కావాలని WHO అడిగింది.
WHO on China Covid Deaths:
60 వేల మంది మృతి..
కొవిడ్ లెక్కల్ని చైనా దాస్తోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో డ్రాగన్ కీలక విషయం వెల్లడించింది. జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక దేశంలో కొవిడ్ మరణాలు పెరిగాయని అంగీకరించింది. డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని నివేదించింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ హెల్త్ కమిషన్ ఈ లెక్కలు వెల్లడించింది. అయితే...ఇవి కేవలం మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న చోట రికార్డ్ చేసిన మరణాలు మాత్రమేనని, వాస్తవంగా ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ లెక్క తేలలేదని తెలిపింది. ఈ 60 వేల మరణాల్లో దాదాపు 5 వేల మందికి పైగా బాధితుల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని చైనా వివరించింది. ఇవి డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య కాలంలో నమోదైన మరణాలని చెప్పింది. ఇన్నాళ్లు కొవిడ్ మరణాల విషయంలో చైనా సరైన విధంగా లెక్కలు వెలువరించ లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ వివరాలు వెల్లడించింది. అయితే..దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ఈ మరణాలపై మరిన్ని వివరాలు అందజేయాలని చైనాను కోరింది. పూర్తి స్థాయిలో కరోనా పరిస్థితులను అంచనా వేయాలంటే ఆ వివరాలు అవసరం అని వివరించింది.
మందులకూ కొరత..
గత నెల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేసినప్పటి నుంచి కేసులు దారుణంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. రోజుల పాటు వెయిట్ చేస్తే తప్ప ఆసుత్రిలో చికిత్స అందని దుస్థితి. ఇక కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేయాలన్నా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొవిడ్ మందులకూ కొరత ఏర్పడింది. కొందరు మెడికల్‌షాప్ వాళ్లతో ముందుగానే మాట్లాడుకుని ఒకేసారి పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా...మిగతా వాళ్లకు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే...చైనా మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. mRNA టీకా టెస్టింగ్ దశలో ఉంది. బూస్టర్ డోస్ కింద ఈ టీకాను అందించనున్నారు. CS-2034 వ్యాక్సిన్ ప్రత్యేకించి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్‌ను అంతం చేసేందుకేనని చైనా చెబుతోంది. ప్రస్తుతం అక్కడ ఈ వేరియంట్స్‌తోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే..చైనా కొవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగా ఉండడం లేదని ఇటీవలే WHO అసహనం వ్యక్తం చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్‌లు, వేరియంట్‌లు, కొవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ వేరియంట్ ఎక్కువగా సోకుతోంది..? ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా..? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది..? ఇలా అన్ని విషయాలనూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఈ వివరాలు కచ్చితంగా ఉంటేనే కరోనాపై పోరాడం సులువవుతుంది" అని WHO స్పష్టం చేసింది. పలు దేశాల్లో ఈ డేటా సరిగ్గా ఉండటం వల్ల కొంత వరకూ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలైందని గుర్తు చేసింది.
Also Read: Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం - ఫ్లైట్‌లో 72 మంది