China Covid Surge: చైనాలో అల్లకల్లోలం- 20 రోజుల్లో 25 కోట్ల మందికి కొవిడ్!
China Covid Surge: చైనాలో డిసెంబర్ నెలలోని తొల 20 రోజుల్లో 25 కోట్ల మందికి వైరస్ సోకినట్లు 'బ్లూమ్‌బర్గ్' వెల్లడించింది.
China Covid Surge: చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే భయంకరమైన పరిస్థితులు చైనాలో కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలోని తొలి 20 రోజుల్లో 25 కోట్ల మందికి చైనాలో వైరస్ సోకింది. ఇటీవల జరిగిన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సమావేశంలో ఇది బయటపడినట్లు పలు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఈ మేరకు నేషనల్ హెల్త్ కమిషన్ సమావేశ వివరాలున్న నోట్ చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఉన్న 140 కోట్ల జనాభాలో 18 శాతం మంది 20 రోజుల్లో వైరస్ బారినపడ్డారు. చైనా ఎన్‌హెచ్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సున్ యాంగ్ అంచనాల మేరకు దేశంలో కొవిడ్ వ్యాప్తి రేటు ఇంకా పెరుగుతోంది.
అంతా అబద్ధం
బీజింగ్, సిచువాన్‌లలో దాదాపు సగం మందికి కొవిడ్ సోకిందని ఆ సమావేశంలో అంచనా వేశారు. వాస్తవానికి ఈ 20 రోజుల్లో చైనా అధికారికంగా ప్రకటించిన కేసుల సంఖ్య 62,592 మాత్రమే. ఈ నెలలో ఒక్కరు మాత్రమే మరణించినట్లు వెల్లడించింది. కానీ వాస్తవ సంఖ్యలు మాత్రం వేరుగా ఉన్నాయి. చైనాలోని గ్రామాల్లో కూడా కొవిడ్ వ్యాప్తి మొదలైంది. ఫలితంగా ఇప్పటికే చాలా గ్రామాల్లో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసి పోయాయి.
ఆదివారం నుంచి చైనాలో కొవిడ్ కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించబోమని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. కొవిడ్ సంబంధించిన సమాచారన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం ప్రచురిస్తుందని తెలిపింది. రిఫరెన్స్, రీసెర్చి కోసమే దీనిని వెల్లడిస్తుందని చెప్పింది.
ఒమిక్రాన్
చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.
చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.