China Protest: బెడిసి కొడుతున్న చైనా జీరో కొవిడ్ పాలసీ, రోడ్లపైకి వచ్చి ప్రజల నిరసనలు
China Protest: ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై చైనా పౌరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
China Protest:
ప్రభుత్వంపై వ్యతిరేకత..
చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కొవిడ్ హబ్‌గా మారిపోయింది డ్రాగన్ దేశం. ఈ అప్రతిష్ఠను తొలగించుకునేందుకు ప్రభుత్వం మరీ దారుణమైన ఆంక్షల్ని విధిస్తోంది. వీటిపై ప్రజలు ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు. రానురాను ఆంక్షలు మరీ తీవ్రమవుతుండటం వల్ల ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. షాంఘైలో ఈ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఒకేసారి 300 మంది రోడ్లపైకి రావడం వల్ల పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘర్షణలు జరిగాయి. ఇటీవల ఉరుమ్‌కీలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. అయితే... అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి వచ్చి ఉంటే వీళ్లంతా బతికుండే వాళ్లని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం కఠినమైన కరోనా ఆంక్షల కారణంగానే..వాళ్లు సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోలేకపోయారని మండి పడుతున్నారు. దీనిపైనే...షాంఘై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించేందుకు రోడ్లపైకి రాగా పోలీసులు వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం 5 నగరాల్లో నిరనసలు తీవ్రమవుతున్నాయి. పీపీఈ కిట్లు ధరించి బయటకు వచ్చిన పౌరులు..పోలీసులపై దాడికి దిగారు. బారికేడ్లు ధ్వంసం చేశారు. దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని నినాదాలు చేశారు. అయితే...ఈ వీడియోలను వెంటనే చైనా సోషల్ మీడియాలో నుంచి తొలగించారు. విమర్శలు రాకముందే...ప్రభుత్వమే ఈ వీడియోలను తొలగించి వేసింది. ఉరుమ్‌కీ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోడానికి మూడు గంటల సమయం పట్టింది. ఇందుకు కారణం...కరోనా ఆంక్షలే.
మళ్లీ ఉద్దృతం..
కొన్ని నెలలుగా బ్రేక్ ఇచ్చిందనుకుంటున్న కరోనా...మరోసారి ఉద్ధృతమవుతోంది. పలు దేశాల్లో మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. కొవిడ్‌కు పుట్టినిల్లైనచైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ దేశం ఇప్పటికే కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారిపోయింది. చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మాస్ టెస్టింగ్ నిర్వహించడంతో పాటు ప్రయాణ ఆంక్షల్నీ విధించింది ఆ దేశం. జీరో కొవిడ్ పాలసీతో తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని గతంలోనే ప్రకటించింది చైనా. కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని నమ్ముతోంది. అందుకే..ఈ సారి కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కాకపోతే...ఈ రూల్స్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, స్నాప్ లాక్‌డౌన్లు, మాస్ టెస్టింగ్, ట్రావెల్ పరిమితులు, ఇలా ఏం చేసినా సరే కరోనా వ్యాప్తిని చైనా అడ్డుకోలేకపోతుంది. 140 కోట్ల చైనా జనాభాతో పోలిస్తే ఈ కేసులు తక్కువైనప్పటికీ, జీరో కొవిడ్ పాలసీ అమల్లో ఉన్నా ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీరో కోవిడ్ విధానం ప్రకారం, చిన్న స్థాయిలో కరోనా వ్యాప్తి కనిపించినా ఆ నగరం మొత్తాన్ని లాక్‌డౌన్ చేస్తారు. కరోనా సోకిన రోగులను నగరానికి దూరంగా ఉంచుతారు.
Also Read: పాలపుంత నుంచి ఏలియన్స్ సిగ్నల్స్ - త్వరలో భూమిపైకి గ్రహాంతర వాసులు ల్యాండ్ !