Children's Boat Library: పాడుబడ్డ పడవలో లైబ్రరీ, వాట్ ఎన్ ఐడియా సర్‌జీ
ఒడిశాలోని బిటర్‌కనిక నేషనల్ ఫారెస్ట్‌లో పాడైపోయిన పడవని లైబ్రరీగా మార్చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి కొత్త అనుభూతికి లోనవుతున్నారు.
బోట్ లైబ్రరీ విశేషాలు తెలుసా..?
ఈ రోజుల్లో లైబ్రరీకి వెళ్లే అలవాటు చాలా వరకు తగ్గిపోతోంది. ఎంత సేపూ స్మార్ట్‌ఫోన్లలో మునిగి తేలిపోతున్నాం. ఒకవేళ బుక్స్ చదవాలి అనుకున్నా పీడీఎఫ్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. అందుకే అన్ని చోట్లా లైబ్రరీల సంఖ్య తగ్గిపోతోంది. ఈ తరం విద్యార్థులకు స్కూల్స్, కాలేజీల్లో తప్ప బయట ఎక్కడా గ్రంథాలయాలు కనిపించటం లేదు. ఇది గమనించి ఒడిశా ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. పాడుబడ్డ ఓ పడవను గ్రంథాలయంగా మార్చేసింది. ఒడిశాలోని బిటర్‌కనిక నేషనల్ ఫారెస్ట్‌లో దంగమల్ నేచర్ క్యాంప్‌లో ఈ బోట్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ నెల జూన్5 వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఇకో టూరిజం కాంప్లెక్స్‌లో ఈ బోట్ లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. టూర్‌కి వచ్చే విద్యార్థులు ఇక్కడికి వచ్చి సందర్శించేలా వసతులు సమకూర్చారు. బిటర్‌కనిక డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జేడీ పతి ఈ బోట్ లైబ్రరీ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ బోట్‌ని మాంగ్రోవ్ ఫారెస్ట్‌ను సంరక్షించేందుకు వినియోగించారట. అది పాడైపోయాక పక్కన పెట్టేశారు. ఇలా నిరుపయోగంగా ఉంచే కన్నా ఏదో విధంగా వినియోగించాలని అనుకున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జేడీ పతి. అప్పుడే ఈ లైబ్రరీ ఐడియా వచ్చి వెంటనే దాన్ని పడవను హౌజ్‌లా మార్చేశారు.
ఇంత చిన్న లైబ్రరీలో 1500 పుస్తకాలున్నాయట.
ఇందులోనే మెట్లు కూడా కట్టేశారు. వాటిని ఎక్కుతూ లైబ్రరీలోకి చేరుకోవచ్చు. పర్యావరణ సమతుల్యత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించటం సహా పర్యావరణ సంరక్షణపై పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ బోట్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు నిర్వాహకులు. మాంగ్రోవ్ ఫారెస్ట్, వెట్‌ల్యాండ్ కన్‌జర్వేషన్ ప్రాధాన్యతను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు డాక్యుమెంట్లు, పుస్తకాలు, డేటా ఇందులో అందుబాటులో ఉంచారు. బిటర్‌కనిక ఇకో టూరిజం, ఇకో డెవలెప్‌మెంట్ సొసైటీ దాదాపు 1500 పుస్తకాల్ని ఈ లైబ్రరీకి అందజేసింది. ప్రస్తుతానికి పర్యాటకులు తక్కువగానే వస్తున్నా విద్యార్థులు మాత్రం ఈ లైబ్రరీని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన రంగులు
వేయటం వల్ల విద్యార్థులు బాగానే వస్తున్నారు. ఈ బోట్ లైబ్రరీలో 32 కంపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు వయసుల వారీగా పర్యావరణంపై అవగాహన కల్పించేలా పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఈ బోట్‌లైబ్రరీని ఏర్పాటు చేసినప్పటి నుంచి స్థానిక స్కూల్స్ అన్నీ పెద్ద ఎత్తున స్టూడెంట్స్‌ని ఇక్కడికి తీసుకొస్తున్నాయి. బయట ఎన్నో లైబ్రరీలకు వెళ్లినా బోట్ లైబ్రరీ మాత్రం చాలా కొత్తగా ఉందని, పర్యావరణం గురించి తెలుసుకునేందుకు తమకెంతో ఉపయోగపడుతోందని అంటున్నారు విద్యార్థులు.