Chief Justice Chandrachud: ఆల్ ఇండియా రేడియోలో ఆర్‌జేగా పని చేశా, రోజూ పాటలు వింటా - సీజేఐ చంద్రచూడ్
Chief Justice Chandrachud: తన 20ల్లో ఆల్ ఇండియా రేడియోలో ఆర్‌జేగా పని చేసినట్టు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.
Chief Justice Chandrachud:
గోవాలోని ఓ కార్యక్రమంలో..
ఇటీవలే సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు డీవై చంద్రచూడ్. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని అనుభవాలను పంచుకున్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో రేడియా జాకీగా పని చేసినట్టు చెప్పారు. "Play It Cool", Date with You,Sunday Request షోస్‌కి ఆర్‌జేగా పని చేసినట్టు తెలిపారు. "చాలా మందికి తెలుసో లేదో. నా 20ల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో ఆర్‌జేగా పని చేశాను" అని చెప్పారు. గోవాలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ ఆసక్తికర అంశాలు చెప్పారు. ఇదే సమయంలో తనలోని హాస్యచతురతనూ బయటపెట్టారు చంద్రచూడ్. రోజూ న్యాయవాదుల మ్యూజిక్ అయిపోగానే..ఇంటికి వెళ్లి తనకు నచ్చిన మ్యూజిక్ వింటానని అన్నారు. "నాకు సంగీతమంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ అభిరుచిని వదల్లేదు. రోజూ కోర్టులో చెవులు పగిలిపోయే న్యాయవాదుల సంగీతం వింటాను. ఆ తరవాత ఇంటికి వెళ్లి నాకు నచ్చిన సంగీతం ఆస్వాదిస్తాను. ఇది నా దినచర్యలో భాగం" అని చీఫ్ జస్టిస్ వెల్లడించారు. గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IIULER)లో అకాడమిక్ సెషన్‌కు హాజరయ్యారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ చంద్రచూడ్ విద్యార్థులకు విలువైన సలహాలిచ్చారు. "మీరేంటో మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఈ పనిని మీరెంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. మీ మనసేం చెబుతోందో తెలుసుకోండి, అర్థం చేసుకోండి" అని సూచించారు.
50వ ప్రధాన న్యాయమూర్తిగా..
సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో పాటు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. 2024 నవంబర్ 10న జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటైర్ అవుతారు. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. మాజీ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. దీంతో ఆయననే ఖరారు చేశారు.
ప్రొఫైల్
1.1959 నవంబరు 11న బాంబేలో జస్టిస్ చంద్రచూడ్ జన్మించారు.
2. దిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ చేశారు జస్టిస్ చంద్రచూడ్.
3. దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు.
4. ఆ తర్వాత ముంబయి యూనివర్సిటీ, అమెరికాలోని ఒక్లహామా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
5. అనంతరం మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు.
6.2000 మార్చి 29న బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై బదిలీ అయ్యారు.
7. అంతకుముందు 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకూ అడిషినల్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.
8. 2016 మే 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Also Read: Viral Video: క్వారంటైన్ వద్దని వేడుకున్నా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు - వైరల్ వీడియో