Satyapal Malik : చర్యలు తీసుకుంటే ఓ బాధ. .. తీసుకోకపోతే మరో బాధ ! బీజేపీ హైకమాండ్‌ను టెన్షన్ పెడుతున్న మేఘాలయ గవర్నర్ సత్యపాల్...
కేంద్ర ప్రభుత్వం, ప్రధానిని సైతం ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేస్తున్న మేఘాలయ గవర్నర్‌పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ తటపటాయిస్తోంది. చర్యలు తీసుకుంటే ఇంకా ఎక్కువ మాట్లాడతారోమోనని లైట్ తీసుకుంటున్నారు.
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వంపై వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు. చివరికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని అహంకారిగా అభివర్ణించారు. అంతటితో వదిలి పెట్టలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా మీడియా ముందు చెప్పారు. ఈ అంశాన్ని మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విపక్ష పార్టీలు సత్యపాల్ మాలిక్ విమర్శలను ఆసరాగా చేసుకుని బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. ఇంత రచ్చ జరుగుతున్నా సత్యపాల్ మాలిక్‌పై బీజేపీ హైకమాండ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు.
Also Read: "బుల్లీ బాయ్"ను పట్టేసుకున్న పోలీసులు ! కానీ బాయ్ కాదు గర్ల్..
సత్యపాల్ మాలిక్ అసంతృప్తి స్వరాన్ని మొదటి సారి వినిపించడం లేదు. కొంత కాలంగా ఆయన కేంద్రాన్ని, ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. చాలా కాలంగా మోడీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడుతూ మోడీ సర్కార్ తీరుపై మండి పడుతున్నారు. అయినప్పటికీ ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించడం కానీ.. చర్యలు తీసుకోవడం కానీ బీజేపీ నేతలు చేయలేకపోయారు. దీంతో సత్యపాల్ మాలిక్ మరింతగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: కుమార్తెను కొట్టిందని టీచర్‌పై జవాన్ కాల్పులు .. కానీ గాయపడింది ఆయన భార్య ! ఎలా అంటే ...
మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పటికీ సత్యపాల్ మాలిక్ యూపీలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందినవారు. ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయనపై చర్యలు తీసుకుంటే ఆ సామాజికవర్గం ఆగ్రహిస్తుందని.. అది యూపీ ఎన్నికల్లో చేటు చేస్తుందని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని మాలిక్ మరింతగా అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. గతంలో ఓ సారి నేరుగా బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. తాను జమ్మూకశ్మీర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నప్పుడు సంతకాలు పెడితే అప్పటి బీజేపీ జమ్మకశ్మీర్ ఇంచార్జ్ వందల కోట్లు ఇస్తానన్నారని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు అప్పటి బీజేపీ ఇంచార్జ్ రామ్మాధవ్ వ్యవహరించారు. ప్రస్తుతం రామ్మాధవ్ బీజేపీ నుంచి వెళ్లిపోయి ఆరెస్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సత్యపాల్ మాలిక్ ఇలా వరుసగా లేని పోని చికాకులు తీసుకొస్తున్నా.. బీజేపీ హైకమాండ్ మాత్రం ఏమీ చేయలేకపోతోంది. మాలిక్‌ను ఎలా కంట్రోల్ చేయాలో బీజేపీకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయితే ఆయనను సైలెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సమయం చూసి ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇప్పుడు తప్పిస్తే ఆయన మరింతగా విమర్శలు చేస్తారు.. అవి బాగా హైలెట్ అవుతాయి. అందుకే బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది
Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?