Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!
Central Information Commission: సమాచార హక్కు చట్టం ద్వారా భర్త జీతం వివరాలు భార్య తెలుసుకోవచ్చట!
Central Information Commission:
సమాచార హక్కు చట్టంతో..
మగాళ్ల జీతం, ఆడవాళ్ల వయసు అడగకూడదంటారు. ఆడవాళ్ల వయసు గురించి పక్కన పెడితే...ఎవరైనా సరే తమ జీతం వివరాలు చెప్పుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎవరో బాగా కావాల్సిన వాళ్లైతే తప్ప అంత సులువుగా చెప్పరు. కేవలం కుటుంబ సభ్యులకే, జీవిత భాగస్వామికి మాత్రమే పరిమితమవుతాయి ఈ లెక్కలు. కానీ...వైవాహిక జీవితంలో ఏదైనా గొడవలు తలెత్తితే...ఈ లెక్కలన్నీ మారిపోతాయి. విడాకులకు అప్లై చేసినప్పుడు ఎమోషన్స్, ఇగోలు అన్నీ పక్కన పెట్టి తప్పకుండా వ్యక్తిగత వివరాలు బయట పెట్టాల్సిందే. ప్రతి ఆస్తిపైనా ఇద్దరికీ హక్కు ఉంటుంది. అలానే పంచుతారు కూడా. ఒకవేళ విడాకులు తీసుకోవటంలో ఇద్దరిలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా న్యాయపరంగా బోలెడన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే భార్య..తన భర్త సంపాదన వివరాలు అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది. నెలవారీ ఖర్చులకు భరణం కూడా డిమాండ్ చేయొచ్చు. అయితే...ఒకవేళ ఆ వ్యక్తి భరణం ఇచ్చేందుకు నిరాకరించినా..తన జీతం వివరాలు చెప్పకపోయినా...ఆ మహిళలు వేరే మార్గంలో వాటిని తెప్పించుకునే వీలుంటుంది. వాటిలో ఒకటి...Right to Information.అంటే...సమాచార హక్కు చట్టం ఉపయోగించి...ఆ లెక్కలన్నీ తేల్చుకోవచ్చన్నమాట. ఇటీవల ఓ కేసులో ఇలానే జరిగింది. అందుకే...ఇప్పుడీ అంశంపై బాగానే చర్చ నడుస్తోంది.
తీర్పులు సమీక్షించాక అనుమతి..
ఓ కేసులో సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ కమిషన్ (CIC)...ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళ తన భర్త జీతానికి సంబంధించిన వివరాలు అడిగిందని, వాటిని 15 రోజుల్లోగా ఆమెకు అందించాలని స్పష్టం చేసింది. సంజు గుప్త అనే మహిళ సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు కావాలని దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో CIC ఇలా ఆదేశాలిచ్చింది. మొదట్లో సెంట్రల్ పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్..ఈ వివరాలు అందించేందుకు నిరాకరించారు. ఆమె భర్త అందుకు అంగీకరించకపోవటమే ఇందుకు కారణం. ఇది తెలుసుకున్న సంజు గుప్త...First Appellate Authority (FAA)ని ఆశ్రయించి అప్పీల్ చేసుకుంది. సీపీఐఓ అధికారిని మందలించిన FAA..మరోసారి అప్లై చేసుకోమని మహిళకు చెప్పింది. గతంలో ఇలాంటి కేసుల్లో ఇచ్చిన తీర్పులను సమీక్షించిన తరవాత...CIC ఆమెకు మద్దతుగా నిలిచింది. 15 రోజుల్లోగా రిసీట్‌లతో సహా ఆమె భర్త జీతం వివరాలు ఆమెకు అందించాలని తేల్చి చెప్పింది.
కర్ణాటకలో మరో వెరైటీ కేసు..
ఓ RTI కార్యకర్త...ప్రభుత్వ మహిళా అధికారి వ్యక్తిగత వివరాలు అడిగి అరెస్ట్ అయ్యాడు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిందీ ఘటన. RTI యాక్టివిస్ట్ ఓ మహిళా అధికారి నుంచి వివరాలు కావాలంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగాడు. "ములబగిలు తాశీల్దార్ ఎన్ని సార్లు పెళ్లి చేసుకున్నారు..? ప్రస్తుతం ఆమె ఎవరితో ఉంటున్నారు..? ఆమె ఎక్కడ, ఏ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకున్నారు..? " లాంటి వివరాలన్నీ RTI చట్టం కింద అడిగారు. అంతే కాదు. ఆమె భర్తలతో విడిపోటానికి కారణమేంటనీ అడిగారు. వాళ్లతో విడాకులయ్యాయా అనీ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలన్నీ చూసి ఆగ్రహం చెందిన ఆ మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?