Theft in Wine Shop : దొంగతనానికి వచ్చి వైన్ షాపులో ఫుల్లుగా తాగి, పడుకున్న దొంగ
Theft in Wine Shop : ఒక్కసారిగా పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లను చూసిన ఓ దొంగ.. తాగకుండా ఉండలేకపోయాడు. దొంగతనానికి వచ్చిన సంగతి మర్చిపోయి మత్తులో ఆ రాత్రంతా అక్కడే పడుకుని ఉన్నాడు.
Theft in Wine Shop : దొంగతనం చేయడం కూడా ఒక ఆర్ట్ అన్న పదం ఊరికే అనలేదు. ఎందుకంటే దొంగతనం కన్నా ముందు అది ఎలా చేయాలి, ఏ టైప్ టెక్నిక్స్ వాడాలి, ఎలా ఎస్కేప్ కావాలి అని పక్కా ప్రణాళిక చేయాలి. ఎంత ప్లాన్ చేసిన కొన్నిసార్లు అది తిప్పికొట్టొచ్చు. కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూంటాయి ఒక్కోసారి. కొందరు దొంగతనం చేసి, అక్కడే పడుకోవడం లాంటి ఘటనలు ఇప్పటికే చూసి ఉంటాం. అదే తరహాలో మద్యం దుకాణంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ.. ఫుల్లుగా తాగి అక్కడే పడుకున్నాడు. ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో తెలియక మత్తులో అక్కడే నిద్రపోయాడు. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనలో ఓ యువకుడు దొంగతనానికి వచ్చి కౌంటర్లో ఉన్న నగదు, వివిధ బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత షాపులో ఉన్న అన్ని మందు బాటిళ్లను చూసి తాగకుండా ఉండలేకపోయాడు. వెంటనే తాను సర్దుకున్న మూట పక్కన పెట్టి.. తాగి, మత్తులో అక్కడే నిద్రపోయాడు. అలా ఆ రాత్రంతా లిక్కర్ షాపులోనే గడిపేశాడు ఆ దొంగ. ఈ నెల 29 రాత్రి 10 గంటలకు వైన్స్ షాప్ మూసివేసిన నిర్వాహకులు, తిరిగి ఈ నెల 30న ఉదయం తెరవగా అందులో ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నిద్రపోయి ఉన్నాడు.
మరుసటి రోజు ఉదయం వైన్ షాపు తెరిచి చూడగా ఆ దొంగ నిద్రపోతూ కనిపించాడు. పక్కనే పెద్ద సంచిలో మందు బాటిళ్లు, డబ్బులు చూసి నిర్వాహకులు షాక్ అయ్యారు. అదే సమయంలో పైన కప్పు ధ్వంసమై ఉండటం కనిపించటంతో.. దొంగతనానికి వచ్చాడని నిర్ధారించుకున్నారు. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు రామాయంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దొంగను మందలించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైన్స్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అతిగా మద్యం తాగి స్పృహ కోల్పోయిన దొంగ
ఈ ఘటనపై స్పందించిన వైన్స్ షాప్ యజమాని పర్ష గౌడ్.. తాము ఆదివారం రాత్రి వైన్స్ మూసివేసి ఇంటికి వెళ్లామని చెప్పారు. మరుసటి రోజు దుకాణం ఓపెన్ చేసి చూసేసరికి ఓ వ్యక్తి నిద్రపోతూ కనిపించాడన్నారన్నారు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి.. వచ్చింది దొంగ అని, మందు తాగి ఆ మత్తులో పడుకుని ఉన్నాడని తెలుసుకున్నామన్నారు. షాప్‌లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌లు, డబ్బు, మద్యం సీసాలను సంచిలో మూట కట్టుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత మందు తాగి, స్పృహ కోల్పోయాడని తెలిపారు.