బీఆర్ఎస్ ఆస్తులు ఆన్ని కోట్లా ? ఏడాది కాలంలో రూ.683 కోట్లకు చేరాయా ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయినప్పటికీ...ఆ పార్టీకి భారీగా ఆస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా గులాబీ పార్టీ నిలిచింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS) ) ఓటమి పాలయినప్పటికీ...ఆ పార్టీకి భారీగా ఆస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీగా గులాబీ పార్టీ నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022-23 ఆడిట్ రిపోర్టులో...తమ పార్టీకి 1,149.84 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించింది. ఇందులో రూ.967 కోట్లు 12 నెలలకు మించిన మెచ్యూరిటీ పీరియడ్‌తో షెడ్యూల్డ్ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఎస్‌బీఐకి చెందిన 8 బ్రాంచుల్లో రూ.180 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు ఈసీకి తెలిపింది. జిల్లా పార్టీ బ్యాంకు ఖాతాల్లో రూ.39.86 లక్షలు, చేతిలో నగదు కింద రూ.77,617 ఉన్నాయి. ఇతర ఆస్తుల రూపంలో రూ.2.02 కోట్లు ఉన్నట్లు ఆడిట్ నివేదికలో పేర్కొంది. 2022 మార్చి 31 నాటికి గులాబీ పార్టీకి రూ.480 కోట్లు ఉంటే... ఏడాది కాలంలో 139.37% ఆస్తులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు పార్టీకి రూ.193 కోట్ల విరాళాలు వచ్చాయి. ఏడాది కాలంలో రూ.683 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయం రూ.16.12 కోట్ల నుంచి రూ.54.16 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి మార్చి 31 నాటికి ఆదాయం రూ.737.67 కోట్లు, ఖర్చులు రూ.57.47 కోట్లు ఉన్నట్లు తెలిపింది. మిగిలిన రూ.680.20 కోట్లను జనరల్ ఫండ్‌కు బదిలీ చేసింది. 2022 మార్చి 31 నాటికి రూ.218.11 కోట్లు సమకూరాయి. ఈ సంవత్సరం 238% ఆస్తులు పెరిగాయి. ఖర్చులు రూ.27.48 కోట్ల నుంచి రూ.57.47 కోట్లకు పెరిగాయి. జనరల్ ఫండ్‌కు తరలించిన నిధులు రూ.190.17 కోట్ల నుంచి రూ.680.20 కోట్లకు చేరాయి. ఎన్నికలు, ఉద్యోగులు, పరిపాలన, ఇతరత్రా అవసరాల కోసం ఈ సారి రూ.56.86 కోట్లు ఖర్చు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో ప్రయాణాలకు రూ.12.30 కోట్లు, ప్రకటనలు, ప్రచారాలకు రూ.14.80 కోట్లు, ఢిల్లీ ఆఫీసు అద్దె కోసం రూ.1.77 కోట్లు, సిబ్బంది వేతనాలు, సంక్షేమం కోసం రూ.1.20 లక్షలు వెచ్చించినట్లు వెల్లడించింది.