BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో భాజపా వర్సెస్ తెరాస ఫైట్ ముదిరింది.
2024 లక్ష్యంగా భాజపా రూట్ మ్యాప్..
భాజపా జాతీయ కార్యవర్గమంతా ఇప్పుడు హైదరాబాద్‌లోనే మేధోమథనం సాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా హోం మంత్రి అమిత్‌షా, జాతీయ కార్యదర్శి జేపీనడ్డా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లోని భారీ బహిరంగ సభలో వీరంతా ప్రసంగించనున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో ఎలా పాగా వేయాలని సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు కాషాయ పార్టీ నేతలు. దాదాపు రెండేళ్ల తరవాత పూర్తి స్థాయిలో ఈ భేటీ జరుగుతోంది. కొవిడ్ కారణంగా గతేడాది దిల్లీలోనే హైబ్రిడ్ విధానంలో ఈ సమావేశాలు జరిగాయి. కొందరు నేతలు వర్చువల్‌గా తమ అభిప్రాయాలు పంచుకోగా, మరికొందరు నేరుగా భేటీలో పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి భాగ్యనగరంలో జరపాలని నిర్ణయించారు.
ప్రధాని ఏం మాట్లాడతారో..?
ఇదంతా ఓ ఎత్తైతే ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారో అన్నది మరో ఎత్తు. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే జలవిహార్‌లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాను, ప్రధాని మోదీ నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ విధానాల వల్లే భారత్ తలదించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇందుకు కౌంటర్‌గా బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ కేసీఆర్ సర్కార్‌పై ఎదురుదాడికి దిగారు. ఈ వాడివేడి వాతావరణంలో ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే సభలో ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. "మోదీ ఊరికే మాట్లాడటం కాదు, మా ప్రశ్నలకు సమాధానమివ్వండి" అంటూ కేసీఆర్ విసిరిన సవాల్‌ను ప్రధాని మోదీ ఎలా స్వీకరిస్తారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
అప్పుడే ఎన్నికల వాతావరణం..
క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, వారిని ఎలా ఆకట్టుకోవాలి అన్న అంశాలపై ఇప్పటికే భాజపా నేతలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. స్పీచ్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధానంగా హైలైట్ చేయనున్నట్టు సమాచారం. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కాస్త ఘాటుగానే సెటైర్లు వేస్తారని అంటున్నారు. కార్యవర్గ సమావేశం ముగిశాకసాయంత్రం 6.15 నిముషాలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి రోడ్ ర్యాలీ నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో 6.30 నిముషాల నుంచి 7.30 వరకూ ప్రసంగిస్తారు. తరవాత రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. ఈ రెండు రోజుల సమావేశానికి భాజపా ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి కాషాయ పార్టీ, తెరాస మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ మొదలైంది. ఫ్లెక్లీల వివాదం ఇందుకు ఉదాహరణ. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్నట్టుగా మారిపోయింది రాజకీయ వాతావరణం.