(Source: ECI/ABP News/ABP Majha)
అమరావతిని ఓటర్లే కాపాడుకోవాలి, విజయవాడ నుంచి పోటీకి రెడీ - సుజనా చౌదరి
Sujana Chowdary: జగన్ ప్రభుత్వమే వస్తే ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసని సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
Sujana Chowdary accused YSRCP: కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ నేత సుజనా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభజన హామీలపై అడిగేవారే లేరని అన్నారు. ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తే ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అమరావతిని కాపాడుకుంటారనే తన నమ్మకమని సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సారి తాను విజయవాడ నుంచి పోటీ చేస్తానని సుజనా చౌదరి చెప్పారు. అందుకు బీజేపీ అధిష్ఠానం కూడా అంగీకరించాల్సి ఉందని అన్నారు. బీజేపీ పెద్దలు ఆదేశిస్తే విజయవాడ నుంచి తప్పకుండా పోటీ చేస్తానని అన్నారు.
‘‘విజయవాడ నుంచి పోటీ చేస్తా. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తా. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. విజయవాడ నుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయం. పొత్తులపై అధిష్టానం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుంది. మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమే. ఏపీ రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుంది. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఈసీ దూరంగా ఉంచడం హర్షణీయం’’ అని సుజనా చౌదరి మాట్లాడారు.