Sonali Phogat Death: సోనాలి ఫోగట్‌ను హత్య చేశారా? ఆ ఆధారాలు ఏం చెబుతున్నాయి?
Sonali Phogat Death: సోనాలి ఫోగట్‌ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Sonali Phogat Death:
ఆ డ్రింక్ తాగటం వల్లే..?
భాజపా సీనియర్ నేత, సినీ నటి సోనాలి ఫోగట్ ఇటీవలే గోవాలో గుండెపోటుతో మృతి చెందారు. అయితే...ఆమె మృతిపై అనుమానాలు న్నాయంటూ కుటుంబ సభ్యులు ఆరోపించటం మొదలు ఈ కేసులో ట్విస్ట్ వచ్చింది. అప్పటి నుంచి పోలీసుల విచారణ కోణంకూడా మారిపోయింది. సోనాలి సోదరుడు...ఆమె ఆహారంలో ఎవరో విషం కలిపారని మొదట ఆరోపించారు. ఇది ముమ్మాటికీ కుట్రేనని వాదించారు. ఆమె సన్నిహితులు కూడా ఇదే విధంగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితంగా...ఫోగట్ మృతిని హత్యా కేసుగా మార్చారు పోలీసులు. వీరి విచారణలో ఇప్పుడు ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో పార్టీ జరుగుతుండగా..సోనాలీ సన్నిహితులు ఆమెతో బలవంతంగా ఓ డ్రింక్ తాగించారని పోలీసులు వెల్లడించారు. ఆ క్లబ్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించిన తరవాత..ఈ వివరాలు చెప్పారు. ఆ డ్రింక్ తాగిన తరవాతే ఆమె ఇబ్బంది పడ్డారని, అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించారని ప్రాథమికంగా నిర్ధరించారు.
ఫోగట్‌తో ఉన్న సుధీర్ సంగ్వన్, సుఖ్వీందర్ లు ఈ పని చేశారని అనుమానించిన పోలీసులు..ఈ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వాటర్ బాటిల్‌లో ఏదో కలిపి ఆమెతో బలవంతంగా తాగించారని తెలిపారు. ఆ తరవాతే ఆమెను నార్త్ గోవాలోని అంజునాలో సెయింట్ ఆంథోని హాస్పిటల్‌కు తరలించారని తెలిపారు. ముందు ఆమె గుండెపోటుతో చనిపోయారని అంతా నిర్ధరించినా...కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఇప్పుడు జరిగిన పరిణామాలతో ఆమెపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా స్వయంగా జోక్యం చేసుకోవటం వల్ల..పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
శరీరంపై గాయాలు..!
శరీరంపై కొన్ని చోట్ల గాయాలు కూడా అయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాక కానీ..ఏ విషయం తేల్చలేమని పోలీసులు స్పష్టం చేశారు. గోవాలోనే కాకుండా ఛండీగఢ్‌లోనూ కెమికల్ ఎగ్జామినేషన్ చేయిస్తామని హరియాణా సీఎం ఖట్టర్ వెల్లడించారు. ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసే విషయంలోనూ ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలూ చేస్తున్నారు. ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయటంతో పాటు ఆమె ఆస్తులు కాజేయాలన్న దురుద్దేశంతోనే ఎవరో హత్య చేయించారని ఆమె సోదరుడు వాదిస్తున్నారు. 2008 నుంచి భాజపాలోనే ఉన్న సోనాలి ఫోగట్...2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలో భూటాన్ కలాన్ గ్రామంలో జన్మించారు
సోనాలి. హిసార్‌కు చెందిన పొలిటీషియన్ సంజయ్ ఫోగట్‌ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త కూడా గుండెనొప్పితోనే మృతి చెందారు. చనిపోవటానికి ముందు రోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ట్విటర్ అకౌంట్ డీపీ కూడా మార్చారు. పలు హరియాణా చిత్రాల్లో, సీరియల్స్‌లో నటించారు సోనాలి. అంతే కాదు. బిగ్‌బాస్-14 షోలోనూ పాల్గొని పాపులర్ అయ్యారు.
Also Read: BJP Sabha : వరంగల్ సభకు గ్రీన్ సిగ్నల్ - తెలంగాణ బీజేపీకి హైకోర్టు ఊరట !