BJP : అనుకున్నంతలోనే సీఎంల మార్పు ! బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..? బలమైన నేతల్ని ఎదగనీయకపోవడం కారణమా...?
బీజేపీలో ముఖ్యమంత్రుల మార్పు సాఫీగా సాగిపోతోంది. ఏ ముఖ్యమంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇది బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..? బలమైన నేతల్ని ఎదగనీయకపోవడం కారణమా...?
భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రుల మార్పు ఇంత సులువా ?. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తమ తమ రాష్ట్రాల సారధుల పనితీరును సమీక్షిస్తోంది. అంచనాలను అందుకోలేని వారిని నిర్మోహమాటంగా తప్పిస్తోంది. అక్కడ ఎలాంటి శషభిషలు లేవు. చర్చోపచర్చలు లేవు. ముఖ్యమంత్రులు సైలెంట్‌గా వెళ్లి గవర్నర్లకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి పదవి మార్పు ఇంత సాఫీగా సాగడం ఉండదు. బీజేపీలోనే ఎలా సాధ్యమవుతోంది..?
ఉరుముల్లేని పిడుగుల్లా బీజేపీ ముఖ్యమంత్రుల మార్పు !
భారతీయ జనతా పార్టీ వరుసగా ముఖ్యమంత్రుల్ని మార్చేస్తోంది. ఉత్తరాఖండ్‌లో రెండు సార్లు సీఎంలను మార్చేసింది. అసోంలో సిట్టింగ్ సీఎంను కాదని వేరే వారికి సీటు ఇచ్చింది. కర్ణాటక, గుజరాత్‌లలో ముఖ్యమంత్రులతోనై సైలెంట్‌గా రాజీనామాలు సమర్పించేలా చేసింది. ఒకప్పుడు సీఎం పదవి నుంచి తప్పించారని సొంత పార్టీ పెట్టుకున్న యడ్యూరప్పలాంటి వాళ్లు కూడా హైకమాండ్ చెప్పిందని పదవిని త్యజించేశారు. ఎక్కడా అసంతృప్తి మాటలు మాట్లాడటం లేదు. ఇక గుజరాత్‌లో అయితే ఆ క్షణం వరకూ సీఎం రాజీనామా చేస్తారని ఎవరికీ తెలియదు. అంత గుట్టుగా చక్కబెట్టేశారు. Also Read : కరోనా మరణాలుగా గుర్తించాలంటే ఈ అర్హతలు ఉండాలి !
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిని మార్చాలంటే రచ్చ రచ్చే..!
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను దేశ ప్రజలు 70 ఏళ్లుగా చూస్తున్నారు. ఆ పార్టీ అత్యంత బలంగా ఉన్న సమయంలో బలహీన పడిన సమయంలోనూ ముఖ్యమంత్రులను మార్చింది. కానీ ఆ మార్పు స్వతహాగా చేసింది కాదు. పార్టీలో నేతలు అంతర్గతంగా కీచులాడుకుని పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని తేలిన తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారు. ఆ మార్పు అంత సులువుగా జరగదు. ఆ పార్టీ నేతలు ఎంత రచ్చ చేయాలో.. పార్టీ పరువును ఎంత బజారున పడేయాలో అంతా చేస్తారు. ఈ ఎపిసోడ్ తరవాత ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు అసంతృప్తితో వెళ్లిపోతారో అంచనా వేయడం కష్టం. ఎప్పటి వరకో ఎందుకు ప్రస్తుతం పంజాబ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు.. ఎదుర్కొంటున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఏ నిర్ణయమూ తీసుకోలేని గడ్డు పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్‌ది. కానీ బీజేపీ మాత్రం తమ పార్టీ విషయాలను చాలా ఈజీగా పరిష్కరించేసుకుంటోంది. Also Read : 'అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?
చెప్పినట్లు వినేవారికే మోడీ,షా అందలం ! అందుకే సాఫీగా నిర్ణయాలు !
బీజేపీలో ఇంత సులువుగా ఎలా నాయకత్వ మార్పు సాధ్యమవుతోందంటే హైకమాండ్ స్థానంలో ఉన్న బలమైన నేతలని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఇద్దరూ తిరుగులేని పట్టును పార్టీపై సాధించారు. వారి మాటను జవదాటే పరిస్థితి ప్రస్తుతం ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వారు ముఖ్యమంత్రులుగా నియమించిన వారు కూడా బలవంతులేమీ కాదు. ఈ విషయంలో వారిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూంటారన్న అభిప్రాయం కూడా ఉంది. ఎమ్మెల్యేలపై పట్టు సాధించి .. దిగిపొమ్మంటే బెట్టు చేసే నేతలను ఇద్దరూ ప్రోత్సహించలేదు. దానికి గుజరాత్‌నే ఉదాహరణకు తీసుకోవచ్చు. విజయ్ రూపానీ అమిత్ షా,మోడీలకు సన్నిహితుడే కానీ మాస్ లీడర్ కాదు. ప్రస్తుతం సీఎంగా ఎంపికైన భూపేంద్రపటేల్ అయితే తొలి సారి ఎమ్మెల్యే. వీరెవరూ పదవి నుంచి దిగిపోవాలంటే దిగిపోతారు కానీ తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయరు. ఉత్తరాఖండ్‌లో కొత్త సీఎం అయినా.. కర్ణాటక కొత్త సీఎం అయినా బీజేపీ అగ్రనేతల ద్వయం మాటను కాదనేవారు కాదు. పార్టీపై వారు సాధించిన పట్టు..బలమైన నేతల్ని ఉన్నతమైన స్థానాలకు చేరకుండా చేయడం వంటి వారి వ్యూహాలుగా సులువుగా అంచనా వేయవచ్చు. Also Read : పంజాబ్‌కు తమిళనాడు గవర్నర్ బదిలీ.. !ఎన్నికల వ్యూహమేనా ?
ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతలు మోడీ, షా.. యూపీలో మార్పు లేకపోవడమే సాక్ష్యం !
నాయకత్వ మార్పు విషయంలో ఎక్కడైతే రచ్చ జరుగుతుందో అక్కడ మోడీ, షా ద్వయం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేస్తూంటారు. ఒక వేళ అలా జరిగితే తమ నాయకత్వంపైనే తిరుగుబాటు స్వరం వినిపిస్తుంది. అది వారికి ఇష్టం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి ఉత్తరప్రదేశే ఉదాహరణ. యోగి ఆదిత్యనాథ్ దాస్‌ను మార్చాలని రెండు నెలల కిందట బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ అక్కడ ఆదిత్యనాథ్ తనను మారిస్తే రాజకీయంగా తిరుగుబాటుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు. అదే సమయంలో మోడీతో పాటు యోగికి కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉందన్న మీడియా సంస్థలు కొన్ని రిపోర్టులు ప్రకటించాయి. ఇలాంటి సమయంలో యోగిని కదిలించడం కన్నా ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న ఉద్దేశానికే అగ్రనేతలు కటటుబడ్డారు. దాంతో ఎలాంటి సమస్యా రాలేదు. Also Read : నేషనల్ హైవేపై కుప్పలుతెప్పలుగా కండోమ్స్.. అసలేమైంది?
కాంగ్రెస్ నాయకత్వంతో పోలిస్తే బీజేపీ హైకమాండ్‌కే లౌక్యం ఎక్కువ !
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాళ్లే రాజకీయాల్లో బాగా రాణిస్తారు. ఆ విషయాలను బీజేపీ అగ్రనేతలుగా ఆ పార్టీని శాసిస్తున్న నరేంద్రమోడీ, అమిత్ షాల నిర్ణయాలను చూస్తే తెలిసిపోతుంది. అందుకే బీజేపీలో ముఖ్యమంత్రుల మార్పు సాఫీగా సాగిపోతోంది. బీజేపీ అంతర్గత రాజకీయం చర్చకు రావడంం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ లౌక్యమే మిస్సయిందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. Also Read : తండ్రిని అరెస్ట్ చేయించిన చత్తీస్‌ఘడ్ సీఎం