Bihar Political Crisis: చెత్త తిరిగి చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది - నితీశ్‌పై లాలూ కూతురి సంచలన పోస్ట్
Bihar Political Crisis: నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై లాలూ కూతురు సెటైరికల్ పోస్ట్ పెట్టారు.
Bihar Political Crisis: నితీశ్ కుమార్ రాజీనామాపై లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య (Rohini Acharya) తీవ్రంగా స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమైంది. "చెత్త అంతా చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది" అని నితీశ్ పేరు ఎత్తకుండానే ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా ఈ పోస్ట్‌పై రగడ జరుగుతోంది. మరీ ఇంత తొందరపాటు అవసరమా అని కొందరు మండి పడుతుంటే...RJD సపోర్టర్స్ మాత్రం నితీశ్‌కి ఇలాంటి చురకలు అంటించాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. 2022లో NDA నుంచి బయటకు వచ్చారు నితీశ్ కుమార్. కాంగ్రెస్, RJD మద్దతుతో మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే...మహాఘట్‌బంధన్‌లో ఏదీ సరిగా లేదని, మునుపటి బలం కోల్పోయిందంటూ నితీశ్ ఆరోపించారు. రాజీనామా చేసిన తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌కి సెటైర్‌గా రోహిణీ ఆచార్య ఈ పోస్ట్ పెట్టారు. "మొత్తానికి చెత్త అంతా మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది" అంటూ చాలా ఘాటుగా కామెంట్ చేశారు.
कूड़ा गया फिर से कूड़ेदानी में
— Rohini Acharya (@RohiniAcharya2) January 28, 2024
कूड़ा - मंडली को बदबूदार कूड़ा मुबारक pic.twitter.com/gQvablD7fC
గతంలోనూ పోస్ట్‌లు..
నిజానికి అంతకు ముందు కూడా నితీశ్ కుమార్‌పై ఇలాంటి పోస్ట్‌లే పెట్టి ఆ తరవాత డిలీట్ చేశారు. కొంత మంది RJD నేతలు అప్పటికే క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్‌ని టార్గెట్ చేస్తూ ఆమె పోస్ట్‌లు పెట్టారని వెల్లడించారు. అయితే...కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ వ్యాఖ్యల్ని ఆమె వెనక్కి తీసుకున్నారని, అందుకే పోస్ట్‌లను తొలగించారని వివరించారు. అప్పటికే కొంత మంది ఆ పోస్ట్‌లను స్క్రీన్‌షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి. ఆమె అంతగా ఫైర్ అవ్వడానికి కారణం..నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. వారసత్వ రాజకీయాలు అంటూ RJDపై తీవ్ర విమర్శలు చేశారు నితీశ్. సరిగ్గా బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలోనే ఈ కామెంట్స్ చేయడం బిహార్ రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఈ వ్యాఖ్యలపైనే రోహిణ ఆచార్య తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు పెట్టి డిలీట్ చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఉన్న సస్పెన్స్‌కి తెర దించుతూ అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. మహాఘట్‌బంధన్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్. "మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం" అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల వెంటనే ఆయన రాజీనామా చేశారు. అటు బీజేపీతో మంతనాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే బీజేపీతో చేతులు కలిపి NDAలో చేరనున్నారు. ఆ తరవాత 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు నితీశ్.