Bihar Political Crisis: చావనైనా చస్తాం బీజేపీతో పొత్తు పెట్టుకోం - నితీశ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్
Bihar Political Crisis: బీజేపీతో పొత్తుపై గతంలో నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Bihar Political Crisis:
"మేం ఎప్పుడో తలుపులు మూసేశాం. నితీశ్‌కి ఎంట్రీ లేనే లేదు" - బీజేపీ
"చావనైనా చస్తాం కానీ..బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోనే పెట్టుకోం" - నితీశ్ కుమార్
ఏడాది క్రితం సంగతి ఇదంతా. 2022లో NDA నుంచి బయటకు వచ్చేశారు నితీశ్ కుమార్. అప్పుడు RJD,కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపైనే కాకుండా బీజేపీ సిద్ధాంతాలపైనా గట్టిగానే విమర్శలు చేశారు. కొంత మంది తమను తామే జాతిపితలా ఊహించుకుంటున్నారంటూ మోదీపై సెటైర్లు కూడా వేశారు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదన్న నానుడిని మరోసారి రుజువు చేశారు నితీశ్. అటు బీజేపీ కూడా మూసిన తలుపులని తెరిచి మరీ నితీశ్‌ని ఆహ్వానిస్తోంది. కానీ..గతంలో చాలా సార్లు మీడియా ప్రశ్నించినప్పుడు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారంటూ మండి పడ్డారు. చివరకు మళ్లీ అదే పార్టీతో చేతులు కలుపుతున్నారు. ఆయన గతంలో చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన ఏమన్నారంటే..
"ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు ఆ ప్రశ్నే వద్దు. చనిపోవడానికైనా వెనకాడం. కానీ...వాళ్లతో మాత్రం కలిసి ముందడుగు వేసేదే లేదు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయో తెలీదు"
-నితీష్ కుమార్, బిహార్ సీఎం
గత కొన్ని రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచారు. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపించాయి. అవి నిజమయ్యాయి కూడా. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ పరిణామంతోనే ఆయన కూటమి నుంచి బయటకు వస్తారన్న సంకేతాలొచ్చాయి.
2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌నే వరించింది. అయితే..ఈ మహాఘట్‌బంధన్‌లో కొన్ని విభేదాలు తలెత్తాయి. సైద్ధాంతికంగా ఒక పార్టీ మరో పార్టీతో విభేదించింది. ఫలితంగా...2017 జులైలో మహాఘట్‌బంధన్ నుంచి తప్పుకున్నారు. వెంటనే బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. NDA నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీతో సరిపడడం లేదంటూ తేల్చి చెప్పారు. RJD,కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: CM Nitish Kumar Resigns: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ రాజీనామా, మహాఘట్‌బంధన్‌కి గుడ్‌బై