Bihar Lady DSP: తనకు డీఎస్పీ ఉద్యోగం వస్తే డ్యూటీలోకి భర్తనూ తెచ్చేసింది.. బిహార్‌లో ఆ మహిళా ఆఫీసర్ కథ మామూలుగా లేదు..!
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 13వ ర్యాంక్ సాధించిన రేషు క్రిష్ణ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తనతో పాటు భర్తకూ పోలీసు యూనిఫాం రెడీ చేయించి.. అధికారిక వాహనంలో తిప్పుతున్నారు.
బిహార్‌లో రేషు క్రిష్ణ అనే డీఎస్పీ కొత్తగా ఇటీవలే ఉద్యోగం సంపాదించారు. ఆమె తన భర్తతో కలిసి ఓ ఫోటో దిగి ఫేస్‌బుక్‌లో పెట్టారు. అంతే ఆమెపై నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదులు వెళ్లాయి. భర్తతో కలిసి ఫొటో దిగితే ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తారా..? అని ఆశ్చర్యపోవాల్సిన పని లేనంత మేటర్ ఆ ఫొటోలో ఉంది. డీఎస్పీ రేషు క్రిష్ణ.. పోలీస్ జీప్‌లో కూర్చుని పోలీస్ యూనిఫాంలో ఉన్న తన భర్తతో కలిసి ఫొటోకు ఫోజిచ్చింది. దాన్నే ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. ఆమె భర్త ఎస్పీ కాదు.. డీఎస్పీ కాదు.. కనీసం పోలీసు శాఖలో ఉద్యోగి కూడా కాదు. కానీ పోలీస్ యూనిఫాం వేసుకుని ఐపీఎస్ లెవల్లో ఫోజు ఇస్తూ ఫొటో దిగారు. ఆ యూనిఫాంపై అధికారిక రాజముద్రలు కూడా ఉన్నాయి. ఇది ఇండియన్ పీనల్ కోడ్ చట్టం సెక్షన్ 140ని ఉల్లంఘించండమేనని పీఎంవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీఎంవో కూడా విచారణ చేయాలని బిహార్ డీజీపీని ఆదేశించింది. ఈ చట్టం కింద నేరం రుజువైతే ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ అంశంపై డీజీపీ వివరణ అడిగితే... సమాధానం చెప్పడానికి డీఎస్పీ రేషు కృష్ణ నిరాకరించారు.
అంతే కాదు.. ఆ ఫొటోను ఫేస్‌బుక్ నుంచి తొలగించడానికి కూడా నిరాకరించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పరీక్షల్లో పదమూడో ర్యాంక్‌ను రేషు కృష్ణ సాధించారు. బిహార్‌లో పరీక్షలు ఎలా జరుగుతాయో.. ఇప్పటికే అనేక సార్లు హెడ్‌లైన్స్‌లోకి ఎక్కాయి. ఈ ఉద్యోగ పరీక్షలు కూడా అలాగే జరిగాయేమో కానీ... అనేక మంది ఉద్యోగాలకు ఎంపికైన వారు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ డీఎస్పీ అయితే హత్య చేసి జైలుకు కూడా వెళ్లారు. ఎలాంటి సమాచారం లేకుండా మిత్రులతో కలిసి జార్ఖండ్ దాలియా టూర్ కు వెళ్లిన ఆమె.. అక్కడ మాటకు మాటా మాటా పెరగడంతో తన మిత్రుడ్ని తుపాకీతో కాల్చి హత్య చేసింది.
అది కూడా ఉద్యోగంలో భాగంగా ఆమెకు ఇచ్చిన తుపాకీతోనే. ఇది బీహార్‌లో సంచలనం సృష్టించింది మరో ప్రొబేషనరీ ఆఫీసర్ అసిస్టెంట్ కలెక్టర్‌లా ఫోజు కొడుతూ.. ప్రైవేటు వాహనాలు.. పోలీసు యూనిఫామ్‌తో ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుని రచ్చ రచ్చ చేశారు. దీంతో ఆమెను జైలుకు తరలించారు. డీఎస్పీ రేషు కృష్ణ చేసింది నేరమని తెలుసు. అయినా ఆమె దాన్ని దిద్దుకోవడానికి సిద్ధపడకపోవడమే ఇక్కడ విచిత్రం. సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించినా ఫేస్ బుక్ నుంచి ఆ పోస్ట్ తొలగించడానికి నిరాకరించడం హాట్ టాపిక్ అవుతోంది.