చుక్క నీరు లేదు కానీ హోళీకి రెయిన్ డ్యాన్స్‌లు - బెంగళూరులో హోటళ్ల తీరుపై అసహనం
Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే మరో వైపు హోటళ్లు హోళీకి రెయిన్ డ్యాన్స్‌లు ప్లాన్ చేస్తున్నాయి.
Bengaluru Water Crisis: ఓ వైపు బెంగళూరులో నీటి కొరత పెరుగుతుంటే మరోవైపు హోళీ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. కొన్ని హోటళ్లు స్పెషల్ హోళీ ప్యాకేజ్‌లు ఇస్తున్నాయి. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లకు ప్లాన్ చేస్తున్నాయి. అసలే నీళ్లు లేక అల్లాడుతుంటే ఇవేం పార్టీలు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే Bangalore Water Supply and Sewerage Board (BWSSB) ఈ సమస్యని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నీళ్లను ఇష్టమొచ్చినట్టు వినియోగించడంపై ఆంక్షలు విధించింది. కార్ క్లీనింగ్ కోసం అని, గార్డెనింగ్ అని నీళ్లు వృథా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని కూడా స్పష్టం చేసింది. నిర్మాణ పనులకూ నీటిని వాడొద్దని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో స్విమ్మింగ్ పూల్స్‌లో డ్రింకింగ్ వాటర్‌ని వాడడంపైనా ఆంక్షలు విధించింది. ఇవేమీ పట్టించుకోకుండా కొన్ని సంస్థలు హోళీ ఈవెంట్స్‌కి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అయితే..ఈ విమర్శలపై హోటల్స్ స్పందిస్తున్నాయి. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు చెబుతున్నాయి. పూల్స్‌లో మంచి నీళ్లని నింపడం లేదని, బోర్ వాటర్‌తోనే హోళీ వేడుకలు చేయనున్నట్టు వివరిస్తున్నాయి. రెయిన్ డ్యాన్స్ నిర్వహించడం లేదని మరి కొన్ని హోటల్స్ చెబుతున్నాయి. మరి కొన్ని చోట్ల Rang De Bengaluru పేరిట వేడుకలు చేయనున్నారు.
మార్చి 24,25వ తేదీల్లో ఈ వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టామని, వాటినే పార్టీలకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు కొందరు నిర్వాహకులు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదని అంటున్నారు. కొన్ని రిసార్ట్‌లు కూడా హోళీ సెలబ్రేషన్స్‌ని పెద్ద ఎత్తునే ప్లాన్ చేస్తున్నాయి. పైగా అసలు తమ రిసార్ట్‌లలో నీటి కొరతే లేదని అంటున్నాయి. వాటర్ ట్యాంకర్‌ల అవసరం లేకుండానే హోళీ వేడుకలు చేసుకుంటామని తేల్చి చెబుతున్నాయి. అక్కడి ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రెండు రోజులకోసారి స్నానాలు చేస్తున్నారు. ఇంట్లో వంట చేస్తే అంట్లు తోముకోడానికి నీళ్లు లేవని డిస్పోజబుల్ ప్లేట్‌లు, కప్‌లు వాడుతున్నారు. కొందరైతే షాపింగ్ మాల్స్‌లోని టాయిలెట్స్‌లో స్నానాలు చేస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగులూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తే సొంతూళ్లకి వెళ్లిపోయి పని చేసుకుంటామని అంటున్నారు. వర్షాకాలం వచ్చేంత వరకూ తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని కంపెనీలకు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. కానీ దీనిపై ఇంకా ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి రోజువారీ అవసరాలు తీరడమే గగనమైపోయింది. వేలకు వేలు పోసి వాటర్ ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ట్యాంకర్‌ల ధరలపై ఆంక్షలు విధించింది. ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వర్షాకాలం వరకూ ఈ కష్టాలు తప్పేలా కనిపించడం లేదని బెంగళూరు వాసులు వాపోతున్నారు.
Also Read: Postal Ballet: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరికి అవకాశం ఉంటుంది? ఎలా ఓటేయాలి?