Ram Mandir: చూపు తిప్పుకోనివ్వని అయోధ్య రామయ్య రూపం, ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనం
Ram Mandir Inauguration: అయోధ్య బాల రాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ramlala Pran Pratishtha: అయోధ్య బాల రాముడు ఎలా ఉంటాడో అన్న ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటి వరకూ బాల రాముడి ముఖం కనిపించకుండా కవర్ చేశారు. ఆ తరవాత ఆ గంతలు తొలగించారు. దీంతో బాల రాముడి దివ్య రూపం దర్శించేందుకు అవకాశం లభించింది. పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణ ప్రతిష్ఠ రోజున కళ్లపై ఉన్న తెరను తొలగిస్తారు. కానీ...అంత కన్నా ముందే అందరికీ దర్శనమిచ్చాడు అయోధ్య రాముడు. బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. ప్రాణ ప్రతిష్ఠ తరవాత అందరికీ దర్శనమిస్తాడనుకున్నా..అంత కన్నా ముందే కనిపించాడు. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది. ఈ విగ్రహం పొడవు 5 అడుగులు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. జనవరి 22న లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిపించనున్నారు. అయోధ్య ఉత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి.
ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్ రాణికి కూడా ఆహ్వానం పంపారు.
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, న్యూజిలాండ్ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు...ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు మలిచిన మూడు విగ్రహాలను పరిశీలించారు. చివరికి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. అయోధ్యలో కొలువు దీరే రాముడి కోసం ఉడతాభక్తిగా ఏదో చేయాలన్న సంకల్పం అందరిలో కనిపిస్తంది. అలా ఆలోచించిన గుజరాత్‌లోని ఓ గ్రామం వినూత్నంగా అగరబత్తిని తయారు చేసింది. గుజరాత్ వడోదరలోని తర్సాలీ గ్రామం ఓ భారీ ప్రయత్నం చేసి సఫలీకృతమైంది. అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3.5 వెడల్పుతో భారీగా దూప్‌స్టిక్‌ను వెలిగించారు. రెండు నెలల పాటు శ్రమించి ఈ భారీ అగరబత్తిని తయారు చేశారు.
Also Read: Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?