Austrian Airlines Flight: పని చేయని టాయిలెట్ ఫ్లష్‌లు, ఉన్నట్టుండి ల్యాండ్ అయిన ఫ్లైట్
Austrian Airlines: ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో టాయిలెట్స్ పని చేయని కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Austrian Airlines Flight:
రెండు గంటల్లోనే ల్యాండింగ్..
ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం కాసేపటికే మళ్లీ ల్యాండ్ అవడం ఈ రోజుల్లో చాలా కామన్ అయింది. తరచూ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. టెక్నికల్ సమస్యలతో అత్యవసర ల్యాండింగ్ తప్పడం లేదు. ఇప్పుడు Austrian Airlines కి అదే అనుభవం ఎదురైంది. వియన్నా నుంచి న్యూయార్క్ వెళ్తున్న Boeing 777 ఫ్లైట్ టేకాఫ్ అయిన రెండు గంటలకే మళ్లీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నారు. దాదాపు 8 గంటల పాటు లాంగ్ జర్నీ చేయాల్సిన ఈ విమానం రెండు గంటల్లోనే ల్యాండ్ అయింది. విమానంలోని టాయిలెట్స్ సరిగ్గా పని చేయకపోవడమే ఇందుకు కారణం. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల టాయిలెట్‌లో ఫ్లష్ సరిగా పని చేయలేదు. దాదాపు 8 టాయిలెట్స్ ఉండగా అందులో 5 వాష్‌రూమ్‌ల్లోనూ సమస్య తలెత్తింది. ప్రయాణికులు చాలా సేపు ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని కంట్రోల్ రూమ్‌తో కమ్యూనికేట్ చేసింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ల్యాండ్ చేశాడు పైలట్. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇలా జరగలేదని అంటున్న సిబ్బంది, ఈ మధ్య సర్వీస్ కూడా చేయించామని చెబుతోంది. విమానం ల్యాండ్ అవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వేరే ఫ్లైట్‌లలో టికెట్ బుక్ చేసి వాళ్లను గమ్యస్థానాలకు చేర్చింది ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ. ఈ సమస్య తలెత్తినప్పుడు విమానం 35 వేల అడుగుల ఎత్తులో ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు పైలట్.
ఫ్లైట్‌లో గొడవలు..
ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో రోజుకో గొడవ జరుగుతోంది. ప్రయాణికులు గొడవ పడడమో, ఫుల్‌గా తాగేసి రచ్చ చేయడమో లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడలాంటి ఘటనే మరోటి జరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ గొడవ మొదలైంది. చేసేదేమీ లేక వెంటనే మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు Air India యాజమాన్యం ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) 6.35 నిముషాలకు ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. కాసేపటికే ప్యాసింజర్‌కి, సిబ్బంది మధ్య గొడవైంది. వెంటనే ఢిల్లీకి తిరుగు పయనమైంది ఫ్లైట్. సిబ్బంది ఆ ప్యాసింజర్‌ను పోలీసులకు అప్పగించి మళ్లీ లండన్‌కు బయల్దేరింది.
"ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 111 ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ఉన్నట్టుండి గొడవ మొదలవడం వల్ల మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ ప్యాసింజర్ మా మాట వినలేదు. మేం ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఊరుకోలేదు. అనుచితంగా ప్రవర్తించాడు. నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మా సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నాడు. అందుకే పైలట్ వెంటనే ఢిల్లీకి ఫైట్‌ని మళ్లించాడు. భద్రతా సిబ్బందికి ఆ వ్యక్తిని అప్పగించాం. ఆ తరవాత మళ్లీ లండన్‌కు బయల్దేరింది. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు కేసు నమోదు చేశారు. ప్రయాణికులు ఎవరైనా డిగ్నిటీగా ఉండాలి. గాయపడిన సిబ్బందికి మా తరపున చేయాల్సినదంతా చేస్తున్నాం. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. వెంటనే ఫ్లైట్‌ని రీషెడ్యూల్ చేశాం. "
- ఎయిర్ ఇండియా యాజమాన్యం
Also Read: Apple: ఇంటర్ చదివినా ఆపిల్‌లో ఉద్యోగం, రెండేళ్లలో లక్ష జాబ్స్, మహిళలకే తొలి ప్రాధాన్యం