Arvind Kejriwal On BJP: ఆ సక్సెస్ ఫార్ములానే నమ్ముకున్న ఆప్, పంజాబ్ సీన్ రిపీట్ అవుతుందా?
Arvind Kejriwal On BJP: గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఎవరుండాలో మీరే చెప్పాలంటూ ప్రజలను కేజ్రీవాల్ కోరారు.
Arvind Kejriwal On BJP:
కాల్ చేసి చెప్పండి: కేజ్రీవాల్
గుజరాత్ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడాలో సూచించాలని ప్రజలనే కోరింది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమ్‌ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విషయం వెల్లడించారు. "గుజరాత్‌కు ఎవరు ముఖ్యమంత్రి కావాలో మీరే నిర్ణయించి చెప్పండి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతే కాదు. ఈ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఓ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్‌కు కాల్ చేసి ఎవరైనా సలహా ఇవ్వొచ్చని తెలిపారు. ఈ వ్యూహంతో వీలైనంత మేర ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది ఆప్. నిజానికి..ఇదే వ్యూహాన్ని పంజాబ్‌లో అమలు చేసింది ఆ పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరే ఎన్నుకోండి అని పోల్ పెట్టగా...అది సక్సెస్ అయింది. అక్కడ ఆప్ అధికారంలోకి వచ్చింది కూడా. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ ఇదే స్ట్రాటెజీ అమలు చేస్తోంది ఆప్. ఇక ఆప్ తరపున సీఎం అభ్యర్థుల రేస్‌లో కొన్ని పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇసుదన్ గాధ్వీ, గోపాల్ ఇటాలియా పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇసుదన్ గాధ్వీ గుజరాత్‌లోని ఓ ఛానల్‌లో యాంకర్. పరివర్తన్ యాత్రలో భాగంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక గోపాల్ ఇటాలియా...గుజరాత్ ఆప్ అధ్యక్షుడిగా ఇప్పటికే బాధ్యతలు చేపడుతున్నారు.
90పైగా సీట్లొస్తాయంటున్న ఆప్..
గుజరాత్‌లో తప్పకుండా తామే గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు కేజ్రీవాల్. ఆప్‌కు 90-93 సీట్ల వరకూ వస్తాయనీ అంటున్నారు. 182 అసెంబ్లీ నియోజకవర్గాలున్న గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే...92 సీట్లు సాధించాల్సిందే. ఇలా చూస్తే...కేజ్రీవాల్ మేజిక్ ఫిగర్ సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. భాజపా ఇంత వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థినే ప్రకటించలేదని, కనీసం ఈ విషయంలో ప్రజల సలహాలు తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయడం లేదని కేజ్రీవాల్ కాషాయ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగిపోయింది. భాజపా, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ రేసులో ఉన్నప్పటికీ...ప్రధాన పోటీ మాత్రం భాజపా, ఆప్ మధ్య కనిపించనుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భాజపా కన్నా ముందుగానే ప్రచారం మొదలు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కేజ్రీవాల్ అయితే...ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. మరో విషయం ఏంటంటే...భాజపా కన్నా ముందుగానే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఆప్. ఆ తరవాత వరుసగా దూకుడుగా ఈ జాబితాలు ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏడో విడత లిస్ట్‌ను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులతో కూడిన జాబితా ఇది. ఇప్పటి వరకూ మొత్తంగా 86 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఆప్. ఆరో విడత లిస్ట్‌లో 20 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఆప్ నెల రోజుల ముందే క్యాంపెయినింగ్ షురూ చేసింది. తరవాత భాజపా గౌరవ్ యాత్ర పేరిట పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల తేదీలు ఎప్పుడైనా వెలువడుతాయి. అయితే...మూడు పార్టీలు శక్తిమేర ప్రయత్నిస్తున్నా ఈ సారి గుజరాత్ ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నదే ఉత్కంఠగా మారింది.