AP CM Jagan: చుక్కల భూములపై రైతులకు సర్వహక్కులు, దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం
AP CM Jagan: చుక్కల భూములపై రైతులకే సర్వహక్కులు కల్పిస్తూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపించింది.
AP CM Jagan: దశాబ్దాల నాటి చుక్కల భూముల సమస్యకు ఏపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది. చుక్కల భూములపై రైతులకే సర్వ హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు రూ. 20 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2 లక్షల 6 వేల 171 ఎకరాల భూములపై రైతులకు సర్వహక్కులు కలగనున్నాయి. వందేళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూసర్వే జరిగినప్పుడు 'ప్రభుత్వం లేదా ప్రైవేటు భూమి' అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ - ఆర్ఎస్ఆర్) పట్టాదారు గడిలో 'చుక్కలు' పెట్టి వదిలేశారు. వాటిని ఇప్పుడు చుక్కల భూములుగా పేర్కొంటున్నారు. వీటిని రైతులు అనుభవిస్తున్నా, సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ చుక్కల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దీంతో రైతులు ఆయా భూములపై వారికే సర్వ హక్కులు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రైతుల డిమాండ్ల నేపథ్యంలో వారికే సంపూర్ణ హక్కులు కల్పించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
పైసా ఖర్చు లేకుండా దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఆ నిర్ణయం మేరకు తాజాగా ఈ భూములపై సాగుదారులకే సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఈ దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. చుక్కల భూములను నిషేధితా జాబితా నుండి తొలగించి రైతులకు హక్కులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ల ద్వారా చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫై చేశారు. వైసీపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఆయా భూములపై రైతులకే సంపూర్ణ హక్కులు దక్కాయి. వారు ఆయా భూములను అమ్ముకోవచ్చు, రుణాలు పొందవచ్చు, తనఖా పెట్టుకోవచ్చు, బహుమతిగా ఇవ్వొచ్చు, వారసత్వపు ఆస్తిగా అందించవచ్చు. వీటిపై రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1902 సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు
' దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యకు విముక్తి కల్పించాలం. గత ప్రభుత్వం చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. చంద్రబాబు రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. చంద్రబాబు హయాంలో భూములు అమ్ముకునే పరిస్థితి లేదు. చుక్కల భూముల హక్కుతో బ్యాంకు రుణాలు తీసుకోవచ్చు. వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు ఉంటుంది. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాం. రైతన్నల కష్టం నేను చూశాను. మీకు నేను ఉన్నాను. ఇప్పటికే గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేశాం. గతంలో అవనిగడ్డ నియోజవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 2 వేల గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశాం. భూ హక్కు పత్రాల కూడా వేగంగా ఇస్తున్నాం. ఈ నెల 20వ తేదీన 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేస్తాం' అని సీఎం జగన్ తెలిపారు.