America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, దుండగుడి దుశ్చర్యలో ముగ్గురు మృతి
America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
America Gun Fire: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికా వ్యాప్తంగా ఏదో ఒక చోట తరచూ గన్ ఫైర్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా యూఎస్ ఈస్ట్ లాన్సింగ్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు వెంట తెచ్చుకున్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు.
గన్‌తో ఇష్టారీతిగా కాల్పులు
సోమవారం రాత్రి 8.30 గంటలకు విశ్వవిద్యాలయంలోకి దుండగుడు ప్రవేశించాడు. క్యాంపస్ లోని రెండు భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు. ఆగంతుడి దుశ్చర్యతో భయాందోళనకు గురైన విద్యార్థులు, క్యాంపస్ సిబ్బంది అక్కడి నుండి పారిపోయారు. కాల్పులు జరిపిన ఆ తర్వాత నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడని సిబ్బంది తెలిపారు. ఆంగతకుడు నార్త్ వైపు ఉన్న ఎంఎస్‌యూ యూనియన్ బిల్డింగ్ నుండి బయటకు వెళ్లిపోయినట్లు విద్యార్థులు, సిబ్బంది వెల్లడించారు.
నల్లజాతీయుడిగా అనుమానం
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ఆగంతుకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్యాంపస్ లోని రెండు భవనాల లోపలకాల్పులు జరిపినట్లు భావిస్తున్న నిందితుడి గురించిన ఫోటోలను, సమాచారాన్ని పోలీసులు విడుదల చేశారు. అనుమానితుడు నల్లజాతీయుడని, పొట్టిగా ఉంటాడని, ఎరుపు రంగు బూట్లు, జీన్ జాకెట్ ధరించాడని, బాల్ క్యాప్ పెట్టుకున్నాడని వెల్లడించారు. అతని ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
కొన్ని రోజుల క్రితం మరో ఘటన
సుమారు నెల రోజుల క్రితం అమెరికా కాలిఫోర్నియాలోని గోషెన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఓ తల్లి, ఆరు నెలల పాప సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ కాలిఫోర్నియాలోని విసాలియా నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి, ఆమె తల్లి సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి ఇద్దరి మృతదేహాలు వీధిలో, మరొకరి శవం తలుపు వద్ద ఉన్నట్లు గుర్తించారు. మరో ముగ్గురు బాధితుల మృతదేహాలు ఇంట్లో ఉండగా.. ఓ వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
కుటుంబాన్ని టార్గెట్ చేసి పక్కా ప్రణాళికతోనే నిందితులు ఈ హత్యలకు పాల్పడినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు వివరించారు. మాదక ద్రవ్యాలు నిల్వ ఉన్నాయన్న అనుమానంతో వారం రోజుల క్రితమే ఈ ఇంట్లో నార్కోటిక్స్ సంబంధిత తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలు జరిగిన వారం రోజుల తర్వాత కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది.