Breaking News Live: భర్తతో గొడవపడి ఆసుపత్రి పై నుంచి దూకిన గర్భిణీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,980కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ఇటీవల రూ.200 మేర తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.65,600 అయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.390 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,980 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,900కి పతనమైంది. వెండి 1 కేజీ ధర రూ.65,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,910 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మరోవైపు వాయవ్య గాలులు తక్కువ ఎత్తులో ఏపీలో వీస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఎలాంటి వర్ష సూచన లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కళింగపట్నంలో 17.4 డిగ్రీలు, మచిలీపట్నంలో 19, బాపట్లలో 17.7, అమరావతిలో 17.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.
గత ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.14 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.91 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో ఇంధన ధరలు పెరిగాయి. 15 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.07 కు చేరగా.. 14 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.49 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 43 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.51 కాగా, ఇక్కడ డీజిల్ పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.05 అయింది. డీజిల్ ధర లీటర్ రూ.95.18 కు దిగొచ్చింది.
భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గినట్లు కనిపిస్తున్నా కేసులు నేడు పెరిగాయి. నిన్నటితో పోల్చితే 6.8 శాతం పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,72,433 (1 లక్షా 72 వేల 433) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ మరో వెయ్యి మంది మరణించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.
బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,008 మంది చనిపోయారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4,98,983కు చేరింది. నిన్న ఒక్కరోజులో 2,59,107 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు.
భర్తతో గొడవపడి ఆసుపత్రి పై నుంచి దూకిన గర్భిణీ
హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ మెటర్నిటీ పెట్లా బురుజు ఆసుపత్రిలో ఓ గర్భిణీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో తన భర్తతో గొడవ పడి ఆసుపత్రి భవనం పై నుంచి గర్భిణీ దూకింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఇటీవలే పెట్లా బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలో భర్తతో గొడవపడి మాటా మాటా పెరిగి భవనంపై నుంచి ఆమె దూకినట్లు సమాచారం. బాధితురాలిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చారిత్రాత్మక ఘటన: హోం మంత్రి సుచరిత
గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయటం చారిత్రాత్మక ఘటన అని హోం మంత్రి సుచరిత అన్నారు. వీరుల త్యాగం తోనే స్వేచ్ఛ అనుభవిస్తున్నామని, జిన్నా టవర్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారు. వివాదం సృష్టించడం సిగ్గు చేటని అన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరంగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బీజేపీ కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, ఐక్యతతో ఉండటం కారణంగానే ప్రశాంతంగా ఉంటున్నాం. జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చారని తెలిపారు.





















