CM Jagan: నేడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - నీట మునిగిన పంటలు పరిశీలన
Andhra News: మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ శుక్రవారం పర్యటించనున్నారు. నీట మునిగిన పంట పొలాలను, నష్టాన్ని పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
CM Jagan Visit Cyclone Affected Areas: సీఎం జగన్ నేడు మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లా గూడూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. చెట్లు విరిగిపడి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టం పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో అధికారులు పంట నష్టానికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తుపాను కారణంగా రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం జగన్ అంతకు ముందు స్పష్టం చేశారు.
బలహీన పడిన తుపాను
తీవ్ర బీభత్సం సృష్టించిన మిగ్ జాం తుపాను తీరం దాటాక కోస్తాను కుదిపేసింది. తుపాను ప్రభావంతో గుంటూరు, తిరుపతి, బాపట్ల, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, చిత్తూరు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. అటు ప్రకాశం నుంచి ఇటు అల్లూరి జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. తుపాను వాయుగుండంగా బలహీనపడి, తర్వాత అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పంటకు తీవ్ర నష్టం
తుపాను ప్రభావిత జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మినుము, కంది, మొక్కజొన్న, మిర్చి, పత్తి, అరటి, ఇతర పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు వరి నేలకొరిగిందని, దీంతో పెట్టుబడి సొమ్ము కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. మరోవైపు, వాగులు, వంకలు పొంగి పొర్లగా ప్రవాహ ధాటికి కొన్ని చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం దగ్గర పెద్ద గడ్డ వంతెన కొట్టుకుపోయింది. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ గోడ కూలిపోయింది. వాగుల ఉద్ధృతితో పలు ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: AP Crop Damage: ఏపీలో ప్రత్యేక బృందాలతో పంట నష్టం అంచనా-జనవరిలో పరిహారం