(Source: ECI/ABP News/ABP Majha)
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు ఉపసంహరించుకంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చిన రిక్వస్ట్ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. స్థానికంగా ఉన్న నాయకులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజిక వర్గాల నాయకులతో సీఎం మంగళవారం రోజు సమావేశం అయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసి మెలిసి జీవిస్తున్నారని.. అక్కడే పుట్టి, అక్కడే పెరిగి జీవిత చరమాంకం వరకు అక్కడే ఉంటున్నారని తెలిపారు. రేపు అయినా అక్కడే పుట్టాలి, అక్కడే పెరగాలి, అక్కడే జీవితాల్ని ముగించాలన్నారు. అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినపుడు.. వాటిని మర్చిపోయి మునుపటిలా కలిసిమెలిసి జీవించాలన్నారు. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు.
మీ మధ్య దూరం తగ్గించి.. మిమ్మల్ని ఏకం చేయాలనేదే నా ప్రయత్నం
కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. దీన్ని ఇలా లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్నారు. దీని వల్ల నష్టపోయేది మనమేనని.. అందుకే అందరం కలిసి ఉండి ఆప్యాయతతో మెలగాలన్నారు. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు, అపోహలు ఉన్నా పక్కన పెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందామన్నారు. తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదామన్నారు. అందరం కలిసి కట్టుగా ఒక్కటవుదాం, మిమ్మల్ని ఒకటి చేయడం కోసమే ఈ ప్రయత్నమంతా చేస్తున్నామన్నారు. వాలంటీర్లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారని.. వ్యవస్థలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అర్హత ఉన్న వారికి ఏ పథకం అయినా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానమన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్ని ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో ఎప్పుడూ మంచి వాతావరణమే ఉండాలి..!
అలాగే రూ. 2 లక్షల కో్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. రూపాయి లంచం లేకుండా ఈ స్థాయిలో ఏరోజూ జరగలేదన్నారు. టీడీపీ హయాంలో తన పాదయాత్రలో లోనే్ ల గురించి ప్రస్తావన వచ్చిందని... అప్పుడు లోన్ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అవికూడా అక్కడక్కడా అరకొర అందేవన్నారు. ఇప్పుడు ప్రతీ ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్థను తీసుకొచ్చామని, మంచి చేసే విషయం ఏం చూడకుండా చేస్తున్నామని వివరించారు. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతందన్నారు. అలాగే ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకొని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఎర్పాటు చేశామన్నారు. ఇది మంది పరిణామం అని, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారని.. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.