Krishna Chivukula Donates To IIT Madras: ఐఐటీ మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రవాసాంధ్రుడు కృష్ణా చివుకుల
Dr Krishna Chivukula : మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చదవి అమెరికాలో స్థిరపడిన కృష్ణా చివుకుల తన ఎదుగుదలకు కారణమైన కళాశాలకు రూ.228 కోట్ల భారీ విరాళం అందజేశారు
Alumnus Donates 228 crore To IIT-Madras: ఏ దేశమేగినా..ఎందుకాలిడినా...పొగడరా నీ జాతి భూమి భారతిని అన్నాడు ఓ మహాకవి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల, మన ఉన్నతికి సాయపడిన కళాశాలను అంత తేలిగ్గా మరిచిపోలేం. ప్రవాస భారతీయుల్లో ఇది ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. తమన ఇంతటి వారిని చేసిన స్వదేశానికి ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటారు. అలాంటి వారిలోనే ఇండోమిమ్ సంస్థ ఛైర్మన్ కృష్ణా చివుకుల(Krishna Chivukula) ఒకరు. ఆయన ఏకంగా తాను చదువుకున్న కళాశాలకు రూ.228 కోట్ల భూరి విరాళం ఇచ్చారు.
ఐఐటీ మద్రాస్‌కు భూరి విరాళం
అమెరికా(America)లో ఉంటున్న ప్రవాస భారతీయుడు, ఇండోమిమ్ సంస్థ ఛైర్మన్ కృష్ణా చివుకుల ఐఐటీ మద్రాస్(IIT Madras)కు ఏకంగా రూ.228 కోట్ల విరాళం అందజేశారు. దేశంలో ఏ విద్యాసంస్థకు ఇప్పటి వరకు ఇంత భారీ విరాళం వచ్చిన దాఖలాలులేవు. మద్రాస్ ఐఐటీలో ఎంటెక్(M Tech) చదవుకుని ఆ తర్వాత అమెరికా వెళ్లి సొంతగా కంపెనీ స్థాపించి బాగా గడించిన కృష్ణా చివుకుల(Krishna Chivukula)...తాను చదివిన కళాశాలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఇంత భారీ మొత్తంలో విరాళం అందజేశారు. ఈ నిధులతో పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించడంతోపాటు...క్రీడాకారులకు ప్రోత్సాహం, క్యాంపస్ మ్యాగ్‌జైన్‌ను నిధులు అందించడం సహా మొత్త ఐదు కేటగిరీలకు దాదాపు 25 ఏళ్లపాటు ఖర్చు చేయనున్నారు. స్వదేశానికి సేవ చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న ఆయన...తన ఎదుగుదలకు కారణమైన మద్రాస్ ఐఐటీకి భారీగా విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
తెలుగువాడే..
గుంటూరు జిల్లా బాపట్ల(Bapatla)లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృష్ణా చివుకుల...8వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఆ తర్వాత పదోతరగతి, ఇంటర్ పూర్తి చేసిన ఆయన...1968లో ఐఐటీ బాంబే( IIT Bombay) నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. అనంతం మద్రాస్ ఐఐటీ(IIT Madras) నుంచి 1970లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి హార్వర్డ్(Harward) విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివారు. కర్ణాటకలోని తుముకూర్ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.
చదువులో దిట్ట అయిన కృష్ణా..అమెరికాలోని ప్రముఖ హాఫ్‌మన్ సంస్థకు తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్‌గా, సీఈవోగా పనిచేశారు. ఆ తర్వాత న్యూయర్క్(Newyark)లో సొంతగా సంస్థను ప్రాంభించి భారత్‌కు విస్తరించారు. భారత్‌కు మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ టెక్నాలజీ(M.I.M)ని పరిచయం చేశారు. ఇండో-యూఎస్ ఎంఐఎం పేరిట ఓ సంస్థను ప్రారంభించారు. విమానాల విడిభాగాలు తయారు చేసే ఈ సంస్థ ఏడాదికి వెయ్యికోట్ల టర్నోవర్ బిజినెస్ చేస్తోంది. తిరుపతి సమీపంలోనూ ఆయన ఓ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తరించే యోచనలో ఉన్నారు.
గతంలోనూ సాయం
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద గతంలోనూ ఆయన ఎన్నో సేవలు అందిచారు. తాను చదువుకునే రోజుల్లో ఉన్న కళాశాల వసతిగృహం కావేరి బ్లాక్‌ను 2020లో రూ.5.5 కోట్లతో ఆధునీకరించారు.2014లో శాటిలైట్ తయారీకి సాయం అందించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆర్థికంగా ప్రోత్సహించి ఆదుకున్నారు. తాజాగా ఇప్పుడు మద్రాస్ ఐఐటీకి రూ. 228 కోట్ల భారీ విరాళం అందజేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఐఐటీ మద్రాస్‌లోని ఓ అకడమిక్ బ్లాక్‌కు ఆయన పేరు పెట్టారు. గతంలోనూ ఆయన్ను విశిష్ఠ పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. అమెరికాలో వ్యాపారులు తాము చదువుకున్న విద్యాసంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారని...అందుకే తాను చదివిన ఐఐటీ మద్రాస్‌కు విరాళం ఇచ్చినట్లు కృష్ణ చెప్పారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ఐఐటీ మద్రాస్ కళాశాలే దోహదం చేసిందని...లేకుంటే తాను ఇంత ఎత్తుగా ఎదిగే వాడిని కాదన్నారు.