Elon Musk: భవిష్యత్‌లో ఉద్యోగాలు ఆప్షనల్ అయిపోతాయ్, అన్ని పనులూ AIతోనే - మస్క్ కీలక వ్యాఖ్యలు
Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా భవిష్యత్‌లో మనకు ఉద్యోగాలు ఉండకపోవచ్చని ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Elon Musk on AI Technology: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా అందరి ఉద్యోగాలు (AI Impact on Job Market) ఊడిపోయే ప్రమాదముందని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ హెచ్చరించాడు. త్వరలోనే AI జాబ్ మార్కెట్‌ని కుదిపేయడం గ్యారెంటీ అని తేల్చి చెప్పాడు. ప్యారిస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. "బహుశా భవిష్యత్‌లో మన ఉద్యోగాలు ఉండకపోవచ్చు" అని అన్నాడు. ఇప్పటికే AIతో జాబ్ మార్కెట్‌పై కచ్చితంగా ప్రభావం పడుతుందని ఎక్స్‌పర్ట్స్ వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే మస్క్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఉద్యోగాలు పోతున్నాయి కదా అని ఈ టెక్నాలజీని తప్పుబట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇకపై ఉద్యోగాలు ఆప్షనల్ అవుతుండొచ్చని స్పష్టం చేశాడు. ఏదో సరదాకి ఏదైనా జాబ్ చేయాలని ఉంటే చేయడం తప్ప ఫుల్‌టైమ్ జాబ్స్ మాత్రం నిలదొక్కుకోలేవని వివరించాడు.
"ఇకపై మన ఉద్యోగాలు ఊడుతుండొచ్చు. ఎవరికీ పని దొరక్కపోవచ్చు. ఏదో సరదాకి ఓ హాబీలా ఉద్యోగం చేయాలనుకుంటే పర్లేదు. కానీ ఇదే ఫుల్‌టైమ్‌గా పెట్టుకుంటే మాత్రం కష్టమే. మనకు అవసరమైన పనులన్నీ AI టెక్నాలజీ చేసి పెట్టేస్తుంది. ఈ టెక్నాలజీతో గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి ఎలాంటి లోటు రాదు"
- ఎలన్ మస్క్, టెస్లా సీఈవో
కొన్నేళ్లుగా AI టెక్నాలజీలో అనూహ్య మార్పులు వస్తున్నాయని, ఆ సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరుగుతోందని వెల్లడించాడు మస్క్. వీలైనంత త్వరగా ఈ సాంకేతికతను అందిపుచ్చుకోడానికి సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించాడు. ఇప్పుడే కాదు. గతంలోనూ మస్క్ AI గురించి ప్రస్తావించాడు. ఈ టెక్నాలజీ తనను భయపెడుతోందని అన్నాడు. కంప్యూటర్లు, రోబోలు మన కన్నా బాగా పని చేయగలుగుతున్నప్పుడు ఇక మన జీవితాలకు అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు. సోషల్ మీడియాకి అలవాటు పడిపోయిన వాళ్లు AI టెక్నాలజీకి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పాడు.