Porsche Accident Case: పోర్షే యాక్సిడెంట్ కేసు, నిందితుడికి నోటీసులు పంపిన జువైనల్ జస్టిస్ బోర్డ్
Pune News: పుణేలో పోర్షే యాక్సిడెంట్ కేసులో నిందితుడైన మైనర్‌ని విచారణకు హాజరు కావాలంటూ జువైనల్ జస్టిస్ బోర్డ్ నోటీసులు పంపింది.
Pune Porsche Accident: పుణేలోని పోర్షే కార్ యాక్సిడెంట్ కేసులో (Pune Porsche Accident) నిందితుడిని మేజర్‌గానే పరిగణించాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డ్‌ని (Juvenile Justice Board) ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బోర్డ్..నిందితుడైన మైనర్‌కి నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. బెయిల్ ఆర్డర్‌ని రివ్యూ చేయాలన్న పోలీసుల విజ్ఞప్తిపై కోర్టు విచారణ చేపట్టనుంది. యాక్సిడెంట్ జరిగిన తరవాత పోలీసులు 17 ఏళ్ల నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. కొద్ది గంటల్లోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు పోలీసులు కూడా బెయిల్ ఆర్డర్‌ని రివ్యూ చేయాలని కోరుతున్నారు. సెషన్స్ కోర్టులో ఈ మేరకు ఆర్డర్‌ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన మైనర్‌గా పరిగణించడం సరికాదని వాదిస్తున్నారు. అయితే...కోర్టు ఈ పిటిషన్‌ని విచారించలేదు. జువైనల్ బోర్డుని ఆశ్రయించాలని సూచించింది. ప్రమాదం జరగడానికి ముందు రాత్రి 9.30 గంటల నుంచి ఒంటి గంట వరకూ పబ్‌లోనే ఉన్నాడు నిందితుడు. అక్కడ మద్యం సేవించాడు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయింది.
ఈ కేసు విచారించిన తరవాత సెషన్స్ కోర్టు మైనర్‌లకు సంబంధించిన చట్టాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ మంజూరు చేసింది. రూ.7,500 షూరిటీ బాండ్ చెల్లించాలని తేల్చి చెప్పింది. ఇకపై ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే అని స్పష్టం చేసింది. అంతే కాదు. RTO ఆఫీస్‌ని విజిట్ చేసి ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలని ఆదేశించింది. 15 రోజుల్లో ఓ ప్రెజంటేషన్ ఇవ్వాలని చెప్పింది. రోడ్ యాక్సిడెంట్స్‌పై 300 పదాలతో ఓ వ్యాసం కూడా రాయాలని ఆదేశాలు జారీ చేసింది.