![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?
Nizamabad News: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో పురుషులకు కూడా బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని నిజామాబాద్ జిల్లా యువకుడు నిరసన తెలిపాడు.
![Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.? a young man protest for special seats to mens in rtc buses at armur in nizamabad Telangana News: 'ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలి' - బస్సుకు అడ్డంగా నిలబడి యువకుడి నిరసన, ఎక్కడంటే.?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/2237462e7cf98e1e6e61e23717e8c2971702723968352876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Young Man Protest for Special Seats in RTC Buses: తెలంగాణలో నూతన ప్రభుత్వం మహిళలకు 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకం కింద సిటీ మెట్రో, ఆర్డినరీ, పల్లెవెలుగు, ఎక్ర్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Travel in RTC Buses) అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బస్సుల్లో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో వాసు అనే యువకుడు పురుషులకు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని నిరసన తెలిపాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూరులో (Armur) శనివారం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల బస్సులన్నీ నిండిపోతున్నాయని, పురుషులకు కనీసం వసతి కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రహదారిపై వెళ్తున్న బస్సు ముందు నిలబడి ఆందోళన చేశాడు. పురుషులకు బస్సుల్లో కనీసం 15 సీట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక నుంచి ఇవి తప్పనిసరి
తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఈ నెల 9 నుంచి మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. 'మహాలక్ష్మి' పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. అయితే, శుక్రవారం వరకూ ఐడీ కార్డులు చూపించకపోయినా ఉచిత సౌకర్యం కల్పించారు. అయితే, శనివారం నుంచి మహిళలందరికీ ఐడీ కార్డు తప్పనిసరి చేశారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కోసం ప్రతీ మహిళ తమ వెంట ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితర గుర్తింపు కార్డులు చూపించాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. గుర్తింపు కార్డు లేకుంటే డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాలని చెప్పారు. మరోవైపు, ఉచిత ప్రయాణం ప్రభావంతో ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా మారాయి. సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఈ సదుపాయంతో ప్రయాణిస్తున్నారు.
మెట్రో రైళ్లపై ప్రభావం
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆ ప్రభావం కొంత హైదరాబాద్ మెట్రో రైళ్లపై పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ఉద్యోగినులు విరివిగా ఈ ఫ్రీ సర్వీస్ ఉపయోగించుకుంటున్నారు. ప్రధాన రూట్లలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సులన్నీ ప్రతి రోజూ రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే, కొంతమంది మహిళలు ట్రాఫిక్ ఇబ్బందులకు గురి కాకుండా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, బస్సుల్లో ఉచితం వల్ల మెట్రోపై అంతగా ప్రభావం ఉండదని, కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. కాగా, గతంతో పోలిస్తే బస్సుల్లో ఉచితం అమలు చేసినప్పటి నుంచీ మెట్రో రైళ్లలో రద్దీ తగ్గిందని, కొన్ని రూట్లలో ఈజీగా సీట్లు దొరుకుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)