Jammu and Kashmir: కశ్మీర్ యువతకు మంచి రోజులొచ్చాయ్, వేలాది మందికి ఉద్యోగాలిచ్చాం - ప్రధాని మోదీ
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని యువతకు మంచి రోజులొచ్చాయని, ఉపాధి పొందుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.
Jammu and Kashmir Jobs:
జాబ్ ఫెయిర్..
జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన ఓ జాబ్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జమ్ము, కశ్మీర్ యువతకు ఇది ఎంతో ముఖ్యమైన రోజని వెల్లడించారు. 20 ప్రాంతాలకు చెందిన 3 వేల మంది యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో కశ్మీర్‌లోని ప్రతిపక్షాలనూ టార్గెట్ చేశారు. "రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం. రకరకాల విభాగాల్లో వారికి ఉద్యోగం ఇస్తాం. జమ్ముకశ్మీర్ చరిత్రలో ఈ 21 శతాబ్దం ఎంతో కీలకమైంది. కొత్త ఆలోచనా విధానంతో ముందుకెళ్లాలి. కొత్త పరిపాలనలో జమ్ము, కశ్మీర్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 2019 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల పోస్ట్‌లు భర్తీ అయ్యాయి. ఇందులో 20 వేల ఉద్యోగాలు గతేడాది ఇచ్చినవే" అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. జమ్ముకశ్మీర్‌లో రోడ్డు సహా ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయని, దీనివల్ల
పర్యాటక రంగమూ అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. పారదర్శకమైన పాలనకు ప్రజలు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని అన్నారు. ప్రభుత్వ సర్వీస్‌లో ఉద్యోగాలు పొందుతున్న యువత కూడా ఇదే పారదర్శకతను కొనసాగించాలని కోరారు. "జమ్ముకశ్మీర్ ప్రజలను ఎప్పుడు కలిసినా వాళ్ల బాధను అర్థం చేసుకునే వాడిని. వ్యవస్థలో లంచగొండితనం పెరిగిపోతే ప్రజలు అలానే బాధ పడతారు. జమ్ముకశ్మీర్ ప్రజలు అవినీతికి వ్యతిరేకం. పాత సవాళ్లను అధిగమించి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే సమయం ఇది" అని వివరించారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్‌పై విమర్శలు..
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని మూడేళ్ల క్రితం రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిర్ణయాన్ని అంతా ప్రశంసించినా...- ఇప్పటికీ కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కశ్మీర్‌లోని స్థానిక పార్టీలు అసహనంగా ఉన్నాయి. కేంద్రం మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించామని స్పష్టం చేసింది. అయితే...అంతటితో ఆగకుండా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు వల్లే ఇన్నేళ్ల పాటు ఈ సమస్య అలా నలుగుతూ వచ్చిందని భాజపా కాస్త గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. "కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్ 370ని అప్పట్లో నెహ్రూ తీసుకురావటం వల్లే అక్కడ అన్ని సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించారు" అని వ్యాఖ్యానించారు. నెహ్రూ చేసిన తప్పుని ప్రధాని మోదీ సరిదిద్దారని స్పష్టం చేశారు. అమిత్‌షా మాత్రమే కాదు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని గత వారం గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో చెప్పారు. నెహ్రూ కారణంగానే కశ్మీర్‌లో సమస్యలు తలెత్తాయని అన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణాన్నీ కాంగ్రెస్ అపహాస్యం చేసిందని అమిత్‌షా మండి పడ్డారు.
Also Read: Twitter Employee Layoff: ట్విటర్‌లో భారీగా లేఆఫ్‌లు? ప్రక్షాళన మొదలు పెట్టిన మస్క్!