అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 అడుగుల ఎత్తులో ఎగిరి పడ్డ కార్ - ముగ్గురు భారతీయులు మృతి
US Accident: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజరాత్‌కి చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
3 Indians Killed in US Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురూ భారతీయులే. గుజరాత్‌కి చెందిన రేఖాబెన్ పటేల్, సంగీత్‌బెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. సౌత్ కాలిఫోర్నియాలో Greenville County వద్ద ఓ వంతెనపై నుంచి అదుపు తప్పిన కార్ ఓ చెట్టుని బలంగా ఢీకొట్టింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం కార్ ఓవర్ స్పీడ్‌తో బ్రిడ్జ్ పక్కన ఉన్న రెయిలింగ్‌ని ఢీకొని 20 అడుగులు ఎత్తులో గాల్లోకి ఎగిరింది. నేరుగా చెట్లలోకి దూసుకెళ్లి అక్కడే చిక్కుకుపోయింది. అంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోడ్‌లో స్పీడ్ లిమిట్ ఉందని, కానీ ఆ లిమిట్‌ని దాటి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా వెల్లడిస్తున్నారు. చెట్లలో చిక్కుకున్న కార్ ముక్కలు ముక్కలైపోయింది. ఆ కార్ ధ్వంసమైన తీరుని బట్టే వాళ్లు ఏ స్పీడ్‌లో వచ్చారో అంచనా వేస్తున్నారు.
"ఎంత వేగంగా వెళ్లుంటే కార్ అదుపు తప్పి అలా ఢీకొట్టి ఉంటుందో అంచనా వేయొచ్చు. దాదాపు 4-6 లేన్‌లు దాటి మరీ 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్లలోకి చిక్కుకుంది. ఆ స్థాయిలో గాల్లోకి ఎగిరింది"
- పోలీసులు
ఈ ఘటన జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైవే ప్యాట్రోల్ కూడా స్పందించింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. కార్‌లో డిటెక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వాళ్లు సౌత్ కాలిఫోర్నియా పోలీసులకు సమాచారం అందించారు.