Shiv Sena: 'ఏ క్షణంలోనైనా సీఎం మార్పు జరగొచ్చు- శిందే వర్గంలో అసంతృప్తి'
Shiv Sena: మహారాష్ట్రలో ఏ క్షణమైన సీఎం మార్పు జరగొచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ ముఖచిత్రం మారనుందా? శివసేనలో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న ఏక్‌నాథ్ శిందేకు షాక్ తగలనుందా? అవును.. శిందేకు షాకిచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలోకి జంప్ కొట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
22 మంది
సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గంలో తాజాగా చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. శిందే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఠాక్రే వర్గం చెబుతోంది. ప్రస్తుతం శిందే నేతృత్వంలోని శివసేనలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 22 మంది భాజపాకు జై కొట్టనున్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.
పోటీకి దూరం
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని ఇటీవల భారతీయ జనతా పార్టీ (భాజపా) నిర్ణయం తీసుకుంది. భాజపా అభ్యర్థి మూర్జి పటేల్ తన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
" అంధేరి ఈస్ట్ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని పోటీలో ఉన్న మా అభ్యర్థి మూర్జి పటేల్‌ను అధిష్ఠానం ఆదేశించింది. పోటీలో ఉంటే ఈ ఉప ఎన్నికలో మా గెలుపు ఖాయం. కానీ రాష్ట్రంలో భాజపా చాలా కాలంగా ఈ ఆనవాయితీని పాటిస్తోంది. మేము గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ మేము మా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నాం. ఈ మేరకు దేవేంద్ర ఫడణవీస్ తీసుకున్న నిర్ణయం మంచిదే. "