Gaza Attacks: హమాస్ చెరలో బందీలుగా 210 మంది పౌరులు - గాజాలో దుర్భర పరిస్థితులు
Gaza Attacks: హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా అతాలకుతలమైంది. హమాస్ చెరలో బందీలు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతోన్న భీకర దాడులతో గాజా అతాలకుతలమైంది. హమాస్ చెరలో బందీలు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మిలిటెంట్ల వద్ద 210 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని తెలిపింది. కనిపించకుండా పోయిన వారి కోసం ఐడీఎప్ ఆపరేషన్ కొనసాగుతోంది. హమాస్ పై ఆపరేషన్ పూర్తైన తర్వాత పూర్తి సంఖ్య వెల్లడయ్యే అవకాశం ఉందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 210 మందిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు అమెరికన్-ఇజ్రాయెల్ మహిళలను విడుదల చేసింది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో చేరాలని లెబనాన్‌లోని సాయుధ సంస్థ హెజ్బొల్లా నిర్ణయించుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యంపై దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులు చేస్తోంది. ప్రతిదాడుల్లో 13 మంది హెజ్‌బొల్లా సభ్యులు హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా స్ట్రిప్ నుంచి హమాస్, పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 550కి పైగా విఫలమయ్యాయని ఐడీఎఫ్ ప్రకటించింది. అవన్నీ వారి భూభాగంలోనే పడిపోయాయని, తమ సొంత పౌరులనే చంపేస్తున్నారని విమర్శించింది.
ప్రజల జీవనం దుర్భరం
ఇజ్రాయెల్ బాంబు దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజల జీవనం దుర్భరంగా మారింది. అన్నపానీయాలు, ఔషధాలు ఇతరత్రా మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈజిప్టు- గాజా సరిహద్దులోని రఫా సరిహద్దు పాయింట్‌ను తెరిచారు. దీంతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పని చేస్తున్న సంస్థలు సేకరించిన సామగ్రితో కూడిన వాహనాలు ఈజిప్టు వైపు నుంచి గాజాలోకి చేరుకున్నాయి. దాదాపు 200 ట్రక్కుల్లో 3 వేల టన్నులకు పైగా సామగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో అక్కడ రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేయడంతో కేవలం రఫా నుంచి మాత్రమే గాజాకు సాయాన్ని చేరవేస్తున్నారు. గాజాలో మొత్తం 10 లక్షలకు పైగా పౌరులు నిరాశ్రయులైనట్లు ఐరాస వెల్లడించింది.
అగ్రరాజ్యం సాయం
గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందన్నారు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. అలాగే, మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదన్నారు జోబైడెన్. ఐక్యరాజ్యసమితి అభ్యర్థనతో అమెరికా, ఈజిప్ట్ దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. యుద్ధం మరింత తీవ్రం కాకుండా మిడిల్‌ఈస్ట్ దేశాల్లో స్థిరత్వం, శాంతి నెలకొల్పడానికి కృషి చేయనున్నాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరు దేశాల అధినేతలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. సెంట్రల్ గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ జరిపిన దాడి సమర్థించలేనిదన్నారు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఆసుపత్రిపై దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. ఆ ప్రాంత భవిష్యత్తు మొత్తం అనిశ్చితిలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.