ఉత్తర్ ప్రదేశ్.. దేశంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీకి ఇక్కడ గెలుపు తప్పనిసరి. ఎందుకంటే అత్యధిక పార్లమెంట్ స్థానాలు యూపీలోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ గెలుపును జాతీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి రావాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ ను గెలుపుబాట పట్టించాలని సోనియా గాంధీ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇది దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.

ప్రియాంక X యోగి..

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేస్తూ కొద్ది నెలలుగా ప్రియాంక గాంధీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలేపతం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రజాదరణ కలిగిన ఓ ఫేస్ కావాలని కార్యకర్తలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీని ప్రొజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక X యోగిగా ఎన్నికలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యోగిని ఎదుర్కొని ప్రియాంక ఏ మేరకు ఎన్నికల్లో సత్తా చాటుతారో చూడాలి.

ఇప్పటికే సీఎం అభ్యర్థిత్వంపై ప్రియాంక కొంత మేరకు సంకేతాలిచ్చారు. "అన్నీ ఇప్పుడే చెప్పాలా.. కొద్ది రోజులు ఆగండి" అంటూ.. రీసెంట్ గా మీడియాకు వివరించారు. మరి యూపీ ఎన్నికల రణాన్ని ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

జోరు పెంచిన అధిష్ఠానం..

కాంగ్రెస్ అధిష్ఠానం.. ఈ మధ్య నిర్ణ‌యాల్లో జోరు పెంచింది. అవ‌సాన దశ‌కు చేరుకున్న పార్టీకి మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు అధినేత్రి సోనియాగాంధీ అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రియాంకాగాంధీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ ఇటీవల వెల్లడించారు. పార్టీ తరఫున ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థిత్వాన్నే నిల‌పాల‌ని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.

వాస్త‌వానికి కొద్దిరోజులుగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రియాంకాగాంధీ పేరు వార్త‌ల్లో వినిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఉత్త‌ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీలో ప‌శ్చిమ ప్రాంత జిల్లాల‌కు ఇన్చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనేక స‌మ‌స్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్యాస్త్రాల‌ను, విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తూ బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ..రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష గ‌ళాన్ని వినిపిస్తున్నారు. వాస్త‌వానికి మూడుద‌శాబ్దాలుగా పార్టీ ఉత్తర‌ప్ర‌దేశ్‌లో అధికారానికి దూరమైంది. అయితే ఈ సారి ప్రియాంకను బ‌రిలోకి దించితే మైనార్టీల‌తో పాటు పెద్ద ఎత్తున మ‌హిళ ఓట‌ర్లు కాంగ్రెస్‌కు అండ‌గా ఉంటార‌ని అధిష్ఠానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.. చూడాలి ఏం జ‌రుగుతుందో..?