UP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్ ప్రాంతంలో లఖ్‌నవూ- అయోధ్య జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ బస్-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు.
ఉత్తర్ప్రదేశ్లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.
బారాబంకి జిల్లా రామ్స్నేహిఘాట్ ప్రాంతంలోని లఖ్‌నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు మోదీ. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్సను అందజేస్తామని వెల్లడించారు.
ఏం జరిగింది?
పంజాబ్ లుధియానా నుంచి బిహార్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మంగళవారం అర్ధరాత్రి బ్రేక్ డౌన్ అవడం వల్ల రోడ్డు పక్కన ఆపారు. బస్సులో ఉన్నవాళ్లు అందరూ వలసకూలీలే. బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్ల చాలామంది బస్సు నుంచి కిందకు దిగి నిల్చున్నారు. అదే సమయంలో ఓ ట్రక్ అతివేగంతో ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రౌమా సెంటర్ లహా బారాబంకి జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు తరలించారు.