Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి
Manipur Violence: మణిపూర్‌లో CRPF సిబ్బందిపై మిలిటెంట్‌లు బాంబుదాడి చేసిన ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Attack on CRPF Soldiers: మణిపూర్‌లో మరోసారి కలకలం (Manipur Violence) రేగింది. బిష్ణుపూర్‌లో CRPF బలగాలపై మిలిటెంట్‌లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పారామిలిటరీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కుకీ తెగకి చెందిన వాళ్లే ఈ కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్నారు. భద్రతా బలగాల పోస్ట్‌ని టార్గెట్‌గా చేసుకుని దాడికి దిగారు. అంతటితో ఆగకుండా బాంబుతో దాడి చేశారు. ఫలితంగా ఏడుగురు పారామిలిటరీ సిబ్బంది తీవ్రంగా (Manipur Attack) గాయపడ్డారు. వీళ్లలో ఇద్దరు చికిత్స పొందుతుండగానే మృతి చెందారు. మే 3వ తేదీతో మణిపూర్‌లో ఈ అల్లర్లు మొదలై ఏడాది పూర్తి కానుంది. సరిగ్గా వారం రోజుల ముందు ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది. మళ్లీ రాష్ట్రం అట్టుడుకుతుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. కొండల మాటున దాక్కుని భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మిలిటెంట్స్ కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. తెల్లవారు జామున 2 గంటలకు ఈ దాడి జరిగినట్టు అధికారులు వెల్లడించారు. Indian Reserve Battalion (IRB) క్యాంప్ వద్ద దాడి చేశారు నిందితులు. ఇటీవలే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇదే క్యాంప్‌లో CRPF సిబ్బంది పహారా కాస్తోంది. కొండ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో సున్నితమైన ప్రాంతంలో ఉంది ఈ క్యాంప్. గతేడాది మే నెలలో ఇక్కడే అల్లర్లు మొదలయ్యాయి. అందుకే ఇక్కడే ఎక్కువగా పహారా కాస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ఇలాంటి ఘటన జరగడం సంచలనమవుతోంది. క్యాంప్‌పై దాడి చేసేందుకు నిందితులు "Pumpi Gun"ని వినియోగించినట్టు అధికారులు చెబుతున్నారు.
"కొండల వెనకాల దాక్కుని ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలైన ఈ కాల్పులు 2 గంటల వరకూ కొనసాగాయి. ఆ తరవాత బాంబులు విసిరారు. అందులో ఒకటి బెటాలియన్‌లో పేలింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు"
- సీనియర్ పోలీస్ అధికారి