Israeli Attack: వెస్ట్‌బ్యాంకుపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు. 9 మంది పాలస్తీనియన్లు మృతి
Israel Vs Palestine: వెస్ట్ బ్యాంకులో జరిపిన దాడుల్లో పాలస్తీనియన్లు మరణించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. జెనిన్, తుల్కరేమ్‌లలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది.
Israel attacks on westbank: ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడి చేసింది. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో 9 మంది పాలస్తీనియన్లు మరణించారు. అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత గాజాపైనే ఆగకుండా వెస్ట్‌బ్యాంక్‌లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం తుల్కరెమ్ నగరంతోపాటు, అల్ ఫరా శరణార్థి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు కాల్పులు చేశాయి. హమాస్, పాలస్తీనా జిహాదీ సంస్థలకు చెందిన మిలిటెంట్లు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నారు. గడిచిన 20 ఏళ్లలో వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత పది నెలలుగా వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 652 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు సమాచారం. పాలస్తీనా-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్యసమితిలోని 15 దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నా, దాడులు మరింత తీవ్రతరం కావడంప పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
అక్టోబర్ 7 నుంచి ఇరు దేశాల్లో యుద్ధ వాతావరణం
అక్టోబర్ 7న పాలస్తీనా ఇస్లామిక్ గ్రూప్ హమాస్ వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది. సాయుధ దళాల చొరబాటుతో ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 1140 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. మరో 240 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించినట్లు ప్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ సమాచారం ప్రకారం తెలుస్తోంది. నవంబర్ చివరిలో జరిగిన సంధి సందర్భంగా వీరిలో 100 మంది విడుదలయ్యారు. మరో 34 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. యూరోపియన్ యూనియన్, యూస్ దళాల సాయంతో పాలస్తీనాలోని అనేక మౌలిక సమూహాలపై ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడులకు తెగబడింది. విద్యుత్, నీటి సరఫరా సంస్థలు, ఇతర ఇంధన సరఫరా సంస్థలు ఈ దాడుల్లో పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 40,405 మంది మరణించగా మరో 93,468 మంది గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. హమాస్ నియంత్రణలో ఉన్న ఎన్‌క్లేవ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం ఇదే వివరాలను వెల్లడించింది.