Russia-Ukraine Crisis: 24 గంటల్లో వెయ్యి మంది రష్యా సైనికులు హతం? గట్టి దెబ్బ కొట్టిన ఉక్రెయిన్
Russia-Ukraine Crisis: గత 24 గంటల్లో వెయ్యి మంది రష్యా సైనికులను హతమార్చినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది.
Russia-Ukraine Crisis:
వెయ్యి మంది మృతి..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. రష్యా దాడులు పెంచుతున్న ప్రతిసారీ...ఉక్రెయిన్ వ్యూహాలు మార్చుకుంటూ ఎదురుదాడికి దిగుతోంది. ఇదే రష్యాకు మింగుడు పడటం లేదు. పుతిన్ కక్షతో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రిజర్వ్ బలగాలనూ రంగంలోకి దింపి ఉక్రెయిన్ మీదకు వదిలారు. అయినా...ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడుతోంది. ఈ పోరాటం
ఫలితంగానే...రష్యా తమ సైనికులను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ చెబుతున్న లెక్కల ప్రకారం గత 24 గంటల్లోనే వెయ్యి మంది రష్యా సైనికులు హతమయ్యారు. ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో 71,200 మంది రష్యా సైనికులు తమ చేతిలో చనిపోయారని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ దెబ్బతో రష్యా ఓ నిర్ణయం తీసుకుంది. జులైలో ఐక్యరాజ్య సమితి, టర్కీ మధ్యవర్తిత్వం వహించి రష్యా, ఉక్రెయిన్‌లు ధాన్యాలు ఎగుమతి చేయాల్సిందిగా ఓ అగ్రిమెంట్ కుదిర్చాయి. యుద్ధ నేపథ్యంలో వాటి ఎగుమతులు ఆగిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్యలు తలెత్తాయి. ఇందుకు పరిష్కారంగానే...ఓ అగ్రిమెంట్‌ను కుదిర్చాయి. అయితే ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని డిమాండ్‌లు చేశారు. ఉక్రెయిన్ నుంచి సెక్యూరిటీ గ్యారెంటీ కావాలని అడిగారు. క్రిమియాలోని రష్యా షిప్‌లపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. ఏదో విధంగా...ఆ ఒప్పందం కుదిర్చినప్పటికీ...దాని వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ దాడితో రష్యా ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది.
వేలాది బలగాలు..
ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెబుతున్న ప్రకారం..24 గంటల్లో 1000 మంది రష్యన్ సైనికులు చనిపోయారు. బ్రిటీష్ డిఫెన్స్ ఇంటిలిజెన్స్ అంతకు ముందే ఈ ఘటనను ఊహించింది. రష్యా సైనికులు భారీ ఆయుధాలు లేకుండానే యుద్ధ రంగంలోకి దిగారని తేల్చి చెప్పింది. ఇప్పటికే రష్యా 41 వేల రిజర్వ్ బలగాలను యుద్ధ క్షేత్రంలో మోహరించింది. గత నెల రష్యన్ సైనికులు ఓటమి చవి చూడటాన్ని గమనించిన పుతిన్..వెంటనే ఈ రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపారు. అప్పటి నుంచి దాడులు, ప్రతిదాడులు పెరుగుతూ వస్తున్నాయి. క్రిమియాలోని రష్యాకు చెందిన నేవల్ బేస్‌పైన డ్రోన్ దాడులు జరిగాయని, దీనిపై ఉక్రెయిన్ వివరణ ఇవ్వాల్సిందేనని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా "ధాన్యాల ఎగుమతులకు" సంబంధించిన ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కకు పెడుతున్నట్టు ప్రకటించారు. తమ ఆహార ఎగుమతులను అడ్డుకోవాలని చూస్తే...రష్యా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని
హెచ్చరించారు. రష్యా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవటంపై అమెరికా మండి పడుతోంది. ప్రపంచమంతా ఆకలి కేకలు వినిపిస్తున్నా..రష్యా ఎలాంటి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుండంట దారుణం అని అమెరికా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో విద్యుత్ స్టేషన్‌లనే టార్గెట్‌గా చేసుకుని రష్యా దాడి చేయటంపై...ఉక్రెయిన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. వ్యూహం మార్చుకుని రష్యా సైన్యంపై యుద్ధం చేస్తోంది.
Also Read: Morbi Bridge Collapse: 'వారిపైనేనా మీ ప్రతాపం- వంతెన కూలిన ఘటనపై సీబీఐ, ఈడీ చర్యలేవి?'