Chitram Choodara Movie Review - చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
Chitram Choodara Review In Telugu: వరుణ్ సందేశ్ 'చిత్రం చూడర' సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేశారు. ఈటీవీ విన్ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్ఎన్ హర్షవర్ధన్
వరుణ్ సందేశ్, శీతల్ భట్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, తనికెళ్ళ భరణి, శివాజీ రాజా, రాజా రవీంద్ర, రవిబాబు, రచ్చ రవి తదితరులు
ETV Win
ETV Win Movie Chitram Choodara Review In Telugu: 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాల ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'చిత్రం చూడర'. శీతల్ భట్ హీరోయిన్. రవిబాబు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, శివాజీ రాజా, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదల చేయాలని తీశారు. ఇప్పుడు డైరెక్టుగా ఈటీవీ విన్ యాప్ / ఓటీటీలో విడుదల చేశారు. మే 9 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.
కథ (Chitram Choodara Movie Story): బాలా (వరుణ్ సందేశ్)ది కొత్తపట్నం. రుక్మిణీ డ్రామా కంపెనీలో ఆర్టిస్ట్. లొకేషన్స్ చూడటానికి ఆ ఊరు వెళ్లిన ఓ మూవీ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ మల్లేశం (శివాజీ రాజా) కంట్లో పడతాడు. తమ కొత్త సినిమాలో హీరో స్నేహితుడి వేషం ఉందని హైదరాబాద్ రమ్మని చెబుతాడు. తన డ్రామా కంపెనీ బ్యాచ్ రంగారావు (కాశీ విశ్వనాథ్), మొద్దు (ధనరాజ్)తో కలిసి వస్తాడు. అయితే... ఆ ముగ్గుర్నీ ప్రొడక్షన్ హౌస్ ఆఫీసులో 90 లక్షల రూపాయలు కొట్టేసిన కేసులో సీఐ సారంగపాణి (రవిబాబు) అరెస్ట్ చేస్తారు.
షూటింగ్ కోసం వెళ్లిన బాలా, రంగారావు, మొద్దును దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం ఏమిటి? పెళ్లి చేసుకోమని బాలా వెంట పడుతున్న మాజీ వేశ్య, ప్రస్తుతం నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న చిత్ర (శీతల్ భట్) ఎలా కాపాడింది? గేమ్ సెంటర్, ఓల్డ్ సిటీ భాయ్ వల్ల కథలో వచ్చిన మలుపులు ఏమిటి? చివరకు ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు 'చిత్రం చూడర' సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Chitram Choodara Review): క్రైమ్... కమర్షియల్ / కంటెంట్ బేస్డ్ కథలకు మాంచి ముడిసరుకు. ప్రతి రోజూ వందల సంఖ్యలో నేరాలు వెలుగులోకి రావడం ప్రజలు చూస్తున్నారు. అటువంటి క్రైమ్ తీసుకుని మూవీ బ్యాక్‌డ్రాప్ యాడ్ చేస్తే కథలో కామెడీతో పాటు ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకని, రియల్ క్రైమ్స్ బేస్ చేసుకుని సినిమాలు తీసే దర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
మూవీ బ్యాక్‌డ్రాప్ & డ్రగ్స్ బేస్డ్ కథతో 'భరతనాట్యం' వచ్చింది. థియేటర్లలోకి ఆ సినిమా ఎప్పుడొచ్చింది? ఎప్పుడు వెళ్లింది? అనేది చాలా మందికి తెలియదు. ఈ మధ్య మూవీ బ్యాక్‌డ్రాప్ & రాబరీ కథతో 'పారిజాత పర్వం' వచ్చింది. సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, హర్ష వల్ల సినిమా గురించి కొందరికి తెలిసింది. కానీ, ఆడలేదు. కనీసం ఆ రెండు సినిమాలతో కూడా 'చిత్రం చూడర'ను కంపేర్ చేయలేం. మరీ నాసిరకం సన్నివేశాలు, ఏమాత్రం పసలేని డైలాగులతో సినిమాను చుట్టేశారు. ఆ రెండు సినిమాల్లో కామెడీ కొంతైనా ఉంటుంది. ఇందులో అదీ లేదు.
'చిత్రం చూడర' మొదలైన అరగంట వరకు సినిమా ఎటు వెళుతుందో అర్థం కాదు. వరుసపెట్టి ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ వెళ్లారు దర్శకుడు ఆర్ఎన్ హర్షవర్ధన్. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ షోరీల్స్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే యువతీ యువకులకు అవకాశాలు రావడం కష్టమైన ఈ రోజుల్లో... నాటకం చూసి హీరో స్నేహితుడి వేషం ఓ మేనేజర్ ఆఫర్ చేశాడనే సీన్ రాసుకున్న దగ్గర మనకు దర్శకుడి ప్రతిభ అర్థమైపోవాలి. నాటకాలు వేసుకునే కుర్రాడిని హైదరాబాద్ పిలిపించి రెంటుకు పెంట్ హౌస్ తీసి ఇచ్చిన సన్నివేశంలో సినిమా అంతా ఎలా ఉంటుందో క్లారిటీకి వచ్చేయాలి. లేదూ ఆ రెండు సన్నివేశాలు కొత్తగా ఉన్నాయని ఫీలైన ప్రేక్షకులు సినిమా చూడటం కంటిన్యూ చేయవచ్చు.
ఆర్ఎన్ హర్షవర్ధన్ రాసిన కథ, స్క్రీన్ ప్లే, మాటల్లో ఆకట్టుకునే అంశం ఒక్కటి లేదు. నాటకం చూసి హీరోతో వేశ్య ప్రేమలో పడటం, బెడ్ మీద ఆ పనిలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోమని అడగటం కొత్తగా ఉంటుందని ఫీలైనట్టు ఉన్నారు. కానీ, ఆ సీన్లు తీసిన తీరు బాలేదు. దర్శకత్వంలో సీరియస్‌నెస్ అసలు కనిపించలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్... చప్పగా సాగుతుంది. ప్రతి సీన్, డైలాగ్, ట్విస్టులో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. హీరో నటుడు కావాలని అనుకోవడం వెనుక కారణం ఏమిటి? నాటకాల్లోకి ఎందుకు వచ్చాడు? హీరోయిన్ వేశ్య వృత్తిలోకి ఎందుకు వచ్చింది? వంటి అంశాలను పైపైన టచ్ చేశారు తప్ప ప్రేక్షకులకు టచ్ అయ్యేలా తీయలేదు.
Also Read: 'బాక్' మూవీ రివ్యూ: ఆత్మగా మారిన తమన్నా - తమిళ హారర్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
రెండు గంటల సినిమా చాలా భారంగా ముందుకు కదులుతుంది. రధన్ సంగీతంలో రెండు పాటలు పర్వాలేదు. అయితే, ప్రేక్షకులు వాటిని గుర్తించడం కష్టమే. సినిమాలో టెక్నికల్ పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
వరుణ్ సందేశ్ నటనలో కొత్తదనం లేదు. ఆయనకు యాక్టింగ్ చేసేంత స్కోప్ కూడా ఆ క్యారెక్టర్ ఇవ్వలేదు. హీరోయిన్ శీతల్ భట్ నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నటనలో ఆమెకు ఏబీసీడీలు కూడా రావు. రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ యాక్టర్లను దర్శకుడు సరిగా వాడుకోలేదు. ధనరాజ్, రచ్చ రవితో కామెడీ చేయించడంలోనూ ఫెయిల్ అయ్యారు.
పాత కథతోనూ హిట్టు తీయవచ్చని చెప్పడానికి ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి సీన్ ఎంగేజ్ చేసేలా ఉంటే ప్రేక్షకులు చూస్తారు. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేకు తోడు మరీ నాసిరకం టేకింగ్, డైరెక్షన్ తోడైతే టార్చరే. అది ఈ సినిమా ఇస్తుంది. మూవీ టీమ్ ఒక్క విషయంలో ప్రేక్షకులకు మేలు చేసింది... ఓటీటీలో విడుదల చేయడంతో థియేటర్లకు వెళ్లి టికెట్ కొనే ఖర్చు మిగిలింది. 'చిత్రం చూడర' అన్నారు. అయితే, ఈ సినిమా చూడటం చాలా కష్టం.
Also Read: ‘లాపతా లేడీస్’ మూవీ రివ్యూ: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కామెడీ మూవీ ఎలా ఉంది?