Prince Telugu Movie Review - 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?
Prince Review - Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన సినిమా 'ప్రిన్స్'. ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా నవ్విస్తుందా? లేదా?
అనుదీప్ కేవీ
శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్
సినిమా రివ్యూ : ప్రిన్స్
రేటింగ్ : 2/5
నటీనటులు : శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్, ప్రేమ్ జి తదితరులు
ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
సంగీతం: తమన్
నిర్మాతలు : సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు
రచన, దర్శకత్వం : అనుదీప్ కేవీ
విడుదల తేదీ: అక్టోబర్ 21, 2022
కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన 'జాతి రత్నాలు' ప్రేక్షకులను నవ్వించింది. ఆ సినిమాతో దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV) సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. దాని తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'ప్రిన్స్' (Prince Telugu Movie). తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. నేడు థియేటర్లలో విడుదలైంది. 'జాతి రత్నాలు' తరహాలో నవ్వించిందా? లేదా? సినిమా ఎలా ఉంది (Prince Telugu Review)?
కథ (Prince Telugu Movie Story) : ఆనంద్ (శివ కార్తికేయన్) ఒక స్కూల్ టీచర్. అయితే... సరిగా వెళ్ళడు. బ్రిటిష్ భామ జెస్సికా అదే స్కూల్ కి టీచర్ గా వస్తుంది. ఆమె కోసం రోజూ స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు ఆనంద్. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లికి తన తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) నుంచి గ్రీన్ వస్తుందని ఆనంద్ అనుకుంటే... రెడ్ సిగ్నల్ పడుతుంది. బ్రిటిష్ భామతో తన కుమారుడు పెళ్లికి విశ్వనాథం ఒప్పుకోడు. అతడి ప్రేమ కథ ఊరిలో మరిన్ని సమస్యలు తీసుకొస్తుంది. తన తండ్రితో పాటు ఊరి ప్రజలను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులను ఆనంద్ ఎలా కన్విన్స్ చేశాడు? ప్రేమ కథను పెళ్లి వరకు ఎలా తీసుకొచ్చాడు? మధ్యలో కన్న కుమారుడిని తనవాడు కాదని అంగీకరించే స్థితికి తండ్రి ఎందుకు వచ్చాడు? అనేది థియేటర్లలో చూడాలి.
విశ్లేషణ (Prince Movie Review) : కామెడీ సినిమాలతో ఓ సమస్య ఉంటుంది. ప్రేక్షకుల దృష్టి కథ కంటే కామెడీపై ఎక్కువ ఉంటుంది. ఆర్టిస్టులు ఎలా పెర్ఫార్మ్ చేశారు? కామెడీ టైమింగ్ ఎలా ఉంది? పంచ్ డైలాగ్స్ పేలాయా? లేదా? అనేది ఎక్కువ చూస్తారు. కామెడీ టైమింగ్ బావుండి... పంచ్ డైలాగ్స్ పేలితే మిస్టేక్స్ పెద్దగా పట్టించుకోరు. కామెడీ తక్కువ అయితే... కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... ప్రిన్స్ విషయంలో కంప్లైంట్స్ ప్రేక్షకుల నుంచి ఎక్కువ రావచ్చు.
ప్రిన్స్ కామెడీ సినిమా మాత్రమే కాదు. ఇందులో ఒక సందేశం కూడా ఉంది. ఆ సందేశాన్ని పక్కన పెడితే... హీరో శివ కార్తికేయన్, చిత్ర దర్శకుడు అనుదీప్ నుంచి ప్రేక్షకులు ఆశించేది కామెడీ. కామెడీ కొన్ని సన్నివేశాలలో వర్కౌట్ అయ్యింది. మెజారిటీ సన్నివేశాలలో వర్కౌట్ కాలేదు. 'జాతి రత్నాలు'తో మేజిక్ క్రియేట్ చేసిన అనుదీప్, మరోసారి అటువంటి ఫీట్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. జాతి రత్నాలు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. యూనిక్ స్టైల్ మేనరిజంతో థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించాయి. ప్రిన్స్ సినిమాలో అటువంటి మేజిక్ జరగలేదు. అలాగని దర్శకుడులో టాలెంట్ లేదని కాదు. సినిమా ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు... పోలీస్ స్టేషన్ సీన్... మళ్లీ పతాక సన్నివేశాలలో హీరోతో మోనోలాగ్ డైలాగ్ చెప్పించే సీన్ చాలా బాగా రాసుకున్నారు. మిగతా సినిమా అంతా ఆ విధంగా ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. జాతి రత్నాలు వర్కవుట్ అయ్యిందని అదే విధంగా, జబర్దస్త్ తరహా స్కిట్స్ రాసుకుంటే ప్రతిసారి వర్కవుట్ కాకపోవచ్చు.
తమన్ సంగీతం అందించడంతో పాటు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బావున్నాయి. వాటి అందంగా చిత్రీకరించారు. అయితే, పాటలు కథలో భాగంగా కాకుండా మధ్యలో బ్రేకులు వేసినట్టు వచ్చాయి. హీరో హీరోయిన్లు మాత్రం బాగా డ్యాన్స్ చేశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఓకే.
నటీనటులు ఎలా చేశారు? : శివ కార్తికేయన్ ఇటువంటి కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్లు గతంలో చేశారు. అలవాటు అయిన రోల్ కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు. హీరోయిన్ మరియాకు తొలి చిత్రమిది. ఆమె నవ్వు బావుంది. బ్రిటిష్ అమ్మాయి పాత్రలో అంతకు మించి నటన ఆశించకూడదు ఏమో!? ల్యాండ్ కబ్జా మాఫియా డాన్ పాత్రలో ప్రేమ్ జి కొంత నవ్వించారు. సత్యరాజ్ ఓకే. మిగతా నటీనటులు పాత్రలకు అనుగుణంగా నటించారు. కానీ, వారిలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.
Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ప్రిన్స్ కూడా జాతి రత్నాలు తరహా చిత్రమే. అయితే... ఆ సినిమాలో వర్కవుట్ అయినట్లు ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. ఫస్టాప్ ఓకే. ఇందులో డైలాగులు ఎక్కువ... కామెడీ తక్కువ. శివ కార్తికేయన్ డాన్ సినిమా తెలుగులో కూడా హిట్ అయ్యిందంటే కారణం కామెడీ మాత్రమే కాదు... అందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాలో అటువంటి ఎమోషన్స్ మిస్ అయ్యాయి. తెలుగులో సినిమా హిట్ కావడం కష్టమే.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?