Moon Knight Review: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?
మార్వెల్ యూనివర్స్‌లో లేటెస్ట్‌గా వచ్చిన మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ
మహ్మద్ డియాబ్, జస్టిన్ బెన్సన్, ఆరోన్ మూర్హెడ్
ఆస్కార్ ఐజాక్, మే కాలమావీ, ఈథన్ హాక్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: మూన్ నైట్
మొత్తం ఎపిసోడ్లు: ఆరు
రేటింగ్: 3/5
నటీనటులు: ఆస్కార్ ఐజాక్, మే కాలమావీ, ఈథన్ హాక్ తదితరులు
సంగీతం: హెషాం నజీ
నిర్మాత: కెవిన్ ఫీజ్
విడుదల తేదీ: మార్చి 25-మే 6, 2022
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటివరకు మొత్తంగా 28 సినిమాలు వచ్చాయి. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా వంటి ఐకానిక్ సూపర్ హీరో సినిమాలన్నీ ఆ సిరీస్‌లోనివే. అయితే 2021 నుంచి వారు కొత్తగా వెబ్ సిరీస్‌లు కూడా రూపొందించడం మొదలుపెట్టారు. వాండా విజన్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, వాట్ ఇఫ్, హాక్ ఐ వెబ్ సిరీస్‌లను మార్వెల్ తన యూనివర్స్‌లో భాగంగా రూపొందించింది. ఇందులో ఇప్పుడు కొత్తగా వచ్చిన సిరీస్ మూన్ నైట్. వెబ్ సిరీస్ ద్వారా మార్వెల్ ఒక క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఇప్పటివరకు వచ్చిన మార్వెల్ కంటెంట్ కంటే భిన్నంగా ఎక్కువ వయొలెన్స్, డార్క్ టోన్‌లో ఈ సిరీస్‌ను రూపొందించారు. దీంతో మూన్ నైట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కథ: స్టీవెన్ గ్రాంట్ (ఆస్కార్ ఐజాక్) ఒక మ్యూజియంలో పని చేసే సాధారణ వ్యక్తి. ఒక్కోసారి తను సడెన్‌గా బ్లాంక్ అయిపోతూ ఉంటాడు. తిరిగి సెన్స్‌కు వచ్చేసరికి తన జీవితంలో కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఏం జరిగిందో గుర్తుండదు. తనలో మార్క్ స్పెక్టర్ అనే మరో వ్యక్తి ఉన్నాడని... బ్లాంక్ అయిపోయిన రోజుల్లో తను మార్క్‌గా మారిపోతున్నానని తను కనుగొంటాడు. ఖాన్షు అనే ఈజిప్షియన్ దేవుడు వీరి శరీరంలోకి ప్రవేశించినప్పుడు వీరు మూన్ నైట్‌గా మారుతుంటారు. మార్క్‌కు లేలా (మే కాలమావీ) అనే భార్య కూడా ఉంటుంది.
మరో వైపు ఆర్థర్ హారో (ఈథన్ హాక్) అనే మతాధిపతి ఆమిట్ అనే దేవత విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ విగ్రహాన్ని కనిపెట్టడానికి అవసరమైన కీలక వస్తువు మార్క్ స్పెక్టర్/స్టీవెన్ గ్రాంట్ దగ్గర ఉందని తెలుసుకుంటాడు. హారో తన లక్ష్యాన్ని అందుకున్నాడా? మార్క్/స్టీఫెన్ అతన్ని అడ్డుకున్నారా? అసలు మార్క్/స్టీఫెన్‌ల్లో ఎవరు ఒరిజినల్? ఈ విషయాలన్నీ తెలియాలంటే మూన్ నైట్ ఆరు ఎపిసోడ్లు చూడాల్సిందే...
విశ్లేషణ: ఈ సిరీస్ చూడాలనుకునే ముందు ఒక మాట. రెగ్యులర్ మార్వెల్ సినిమాలను లేదా టిపికల్ సూపర్ హీరో సినిమాలను (కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడటం, పిల్లలకు ఎక్కువ నచ్చే కంటెంట్) ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చకపోవచ్చు. సూపర్ హీరో జోనర్‌లో కొత్త తరహా ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ సిరీస్‌ను కచ్చితంగా చూడాల్సిందే. డీసీ సినిమాల తరహాలో డార్క్ కంటెంట్, కొంచెం ఎక్కువ వయొలెన్స్‌తో ఈ సిరీస్‌ను మార్వెల్ రూపొందించింది. వెబ్ సిరీస్‌లో నిడివి సమస్య ఉండదు కాబట్టి క్యారెక్టర్ డెవలప్‌మెంట్, స్ట్రగుల్, కాన్‌ఫ్లిక్ట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి మార్వెల్‌కు సరైన ప్లాట్‌ఫాం దొరికింది. యాక్షన్ సన్నివేశాల్లో వయొలెన్స్ మరీ ఎక్కువైందని చెప్పలేం కానీ... మార్వెల్ సినిమాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంది.
హాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా రైటర్స్, డైరెక్టర్స్ వేర్వేరుగా ఉంటారు. వెబ్ సిరీస్‌లకు అయితే ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో డైరెక్టర్ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ సిరీస్‌కు కూడా ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. అనవసర సన్నివేశాలు లేకుండా రైటర్స్ జాగ్రత్తలు తీసుకోగా... బోర్ కొట్టించకుండా సిరీస్‌ను తెరకెక్కించడంలో డైరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. సిరీస్‌కు యాక్షన్ సన్నివేశాలు పెద్ద ప్లస్. దీంతో ఒకే వ్యక్తిలో ఉండే ఇద్దరు పర్సనాలిటీల మధ్య ఎమోషన్‌ను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. సిరీస్ చివర్లో వచ్చే పోస్ట్ క్రెడిట్స్ సీన్ తర్వాతి సీజన్‌కు లీడ్ ఇవ్వడంతో పాటు సర్‌ప్రైజ్ కూడా చూస్తుంది. అక్కడక్కడా ఫ్లో డ్రాప్ అవ్వడం ఒక్కటే మైనస్.
హెషాం నాజీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. గ్రెగరీ మిడిల్‌టన్, ఆండ్రూ డియాజ్ పలెర్మో సినిమాటోగ్రఫీ సిరీస్‌ను అందంగా చూపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... స్టీఫెన్ గ్రాంట్, మార్క్ స్పెక్టర్‌గా ఆస్కార్ ఐజాక్ జీవించాడు. ఐదో ఎపిసోడ్‌లోని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన హైలెట్. మార్క్ స్పెక్టర్ వయొలెంట్ క్యారెక్టర్ కాగా... స్టీఫెన్ గ్రాంట్ క్యారెక్టర్ సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడాను ఆస్కార్ అద్భుతంగా చూపించాడు. లేలాగా నటించిన మే కాలమావీ కూడా బాగా నటించింది. చివరి ఎపిసోడ్‌లో తన ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంటుంది. ఇక ఆర్థర్ హారో పాత్రలో నటించిన ఈథన్ హాక్ కూడా మంచి ప్రదర్శన కనపరిచాడు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఒక కొత్త తరహా సూపర్ హీరో వెబ్ సిరీస్ చూడాలనుకునే వారికి మూన్ నైట్ మంచి చాయిస్.