Jubilee Web Series Review - 'జూబ్లీ' రివ్యూ : అదితిరావు హైదరి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - Jubilee Web Series On Prime Video : అదితి రావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన 'జూబ్లీ' వెబ్ సిరీస్ ఐదు ఎపిసోడ్స్ విడుదల అయ్యాయి. హిందీతో పాటు తెలుగు, ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
విక్రమాదిత్య మోత్వానీ
అదితి రావు హైదరి, ప్రసూన్ జీత్ ఛటర్జీ, అపర్ శక్తి ఖురానా, వామికా గబ్బి, సిదాంత్ గుప్తా, రామ్ కపూర్, శ్వేతా బసు ప్రసాద్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : జూబ్లీ
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అదితి రావు హైదరి, ప్రసూన్ జీత్ ఛటర్జీ, అపర్ శక్తి ఖురానా, వామికా గబ్బి, సిదాంత్ గుప్తా, రామ్ కపూర్, శ్వేతా బసు ప్రసాద్ తదితరులు
స్వరాలు : అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం : ఆలోకనందా దాస్ గుప్తా
రచన, దర్శకత్వం : విక్రమాదిత్య మోత్వానీ
విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2023
ఎపిసోడ్స్ : 5 (మిగతా 5 ఎపిసోడ్స్ ఏప్రిల్ 14న విడుదల అవుతాయి)
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
అదితి రావు హైదరి (Aditi Rao Hydari) నటించిన తాజా వెబ్ సిరీస్ 'జూబ్లీ' (Jubilee Web Series). హిందీ, బెంగాలీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో 'కొత్త బంగారు లోకం' ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad), సుధీర్ బాబు 'భలే మంచి రోజు' హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) కీలక పాత్రల్లో నటించారు. సంజయ్ లీలా భన్సాలీ శిష్యుడు, దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ తెరకెక్కించిన ఈ సిరీస్ (సగమే రిలీజ్ అయ్యింది) ఎలా ఉందంటే?
కథ (Jubilee Web Series Story) : మదన్ కుమార్ అనే కొత్త కథానాయకుడిని రాయ్ స్టూడియోస్ పరిచయం చేయాలనుకుంటుంది. ఆడిషన్స్ నిర్వహిస్తుంది. జంషెద్ ఖాన్ (నందీష్ సింగ్ సందు) ఎంపికవుతాడు. రాయ్ స్టూడియోస్ అధినేత శ్రీకాంత్ రాయ్ (ప్రసూన్ జీత్ ఛటర్జీ) భార్య, ప్రముఖ కథానాయిక సుమిత్రా కుమారి (అదితి రావు హైదరి) లేచిపోతుంది. జంషెద్, తన భార్య లక్నోలో ఉన్నారని తెలుసుకున్న శ్రీకాంత్ రాయ్... వాళ్ళిద్దరినీ ముంబై తీసుకొచ్చే బాధ్యత నమ్మకస్తుడైన పనోడు బినోద్ దాస్ (అపర్ శక్తి ఖురానా) చేతిలో పెడతాడు. సుమిత్రా కుమారి ముంబై వస్తుంది కానీ జంషెడ్ కాదు. అతను ఏమయ్యాడు? మదన్ కుమార్ పేరుతో కొత్త హీరోగా బినోద్ దాస్ ఎలా పరిచయం అయ్యాడు? దేశ విభజన సమయంలో కరాచీ నుంచి ఇండియాకు శరణార్థిగా వచ్చిన జై ఖన్నా (సిదాంత్ గుప్తా), వైశ్య నిలోఫర్ ఖురేషి (వామికా గబ్బి) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Jubilee Web Series Review Telugu) : 'జూబ్లీ' వెబ్ సిరీస్ మొత్తం పది ఎపిసోడ్స్! అయితే, ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఏప్రిల్ 7న విడుదల అయ్యాయి. మిగతా ఐదు ఏప్రిల్ 14న విడుదల కానున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఐదు ఎపిసోడ్స్ చూస్తే... 'అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప... హీరోలు, విలన్లు లేరీ నాటకంలో' - 'ప్రస్థానం' సినిమాలో సాయికుమార్ డైలాగ్ గుర్తుకు వస్తుంది.
తన భర్త ఇతర మహిళలతో పడక సుఖం కోరుకుంటున్నాడని తెలిసిన ఓ స్టార్ హీరోయిన్ స్టేజి ఆర్టిస్టుతో లేచిపోతుంది. భార్య వేరొకరితో ఎఫైర్ పెట్టుకుందని తెలిసినా ప్రొడక్షన్ హౌస్ కోసం వెనక్కి తీసుకురావాలని కోరుకుంటాడు ఆ భర్త. నటుడు కావాలనుకున్న ఓ వ్యక్తి, తనకు అడ్డు వస్తాడనుకున్న మనిషి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సాయం చేయడు. లగ్జరీ లైఫ్ కోసం, నటి కావడం కోసం వయసు ఎక్కువ ఉన్న ఫైనాన్షియర్ ఉంపుడుగత్తెగా ఉండటానికి సిద్ధపడిన ఓ వేశ్య. ఒక్కరు అని కాదు... సిరీస్ మొత్తంలో చాలా పాత్రల్లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. తమ తమ అవసరాల కోసం తప్పులు చేయడానికి తెగబడతారు.
సిరీస్ నేపథ్యం అంతా 1947లో ఉంటుంది. అప్పటి రాజకీయాల ప్రభావం చిత్ర పరిశ్రమ మీద ఏ విధంగా ఉంది? అప్పట్లో స్టార్స్ ఎలా ఉండేవారు? స్టార్స్ మీద నిర్మాణ సంస్థల పైచేయి ఎలా ఉండేది వంటివి చక్కగా చూపించారు. అయితే, సిరీస్ అంతా ఒక్కటే సమస్య... ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు గంట ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్... అన్నీ సూపర్బ్! కానీ, నిడివి ఒక్కటీ ఇబ్బంది పెడుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు తక్కువ మంది ఉన్నారు. అందువల్ల, కనెక్ట్ కావడం కష్టం. కానీ, ఒక్కసారి సిరీస్ చూడటం మొదలు పెడితే అలా అలా చూస్తూ ఉంటాం!
'సినిమా చేయాలనుకునేవాళ్ళు ఇంకొకరు ఎవరితోనైనా ఉండాలి, పడుకోవాలి - శారీరకంగానూ, మానసికంగానూ! నువ్వే అదే చెయ్' - సిరీస్‌లో ఓ డైలాగ్ ఇది. తన ముందు పెళ్లి ప్రతిపాదన ఉంచిన, దర్శకుడు కావాలనుకున్న శరణార్థితో నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేశ్య చెప్పే మాట! సిరీస్ అంతా డైలాగులు తక్కువే. కానీ, ఉన్న వాటిని కొన్ని లోతైన భావాలు చెప్పాయి. విక్రమాదిత్య మోత్వానీ అప్పటి కాలాన్ని స్క్రీన్ మీద చక్కగా చూపించారు.
నటీనటులు ఎలా చేశారంటే? : సుమిత్రా కుమారిగా అదితి రావు హైదరి సెటిల్డ్ పెరఫార్మన్స్ చేశారు. ఎమోషనల్ సీన్స్ చేయడం ఆమెకు కొత్త కాదు. మరోసారి 'జూబ్లీ'లో చక్కటి భావోద్వేగాలు చూపించారు. శ్వేతా బసు ప్రసాద్ కనిపించేది కొన్ని సన్నివేశాలే. కథలో కీలకమైన సన్నివేశంలో ప్రభావం చూపించారు. వామికా గబ్బి నటన ఆకట్టుకుంటుంది. మదన్ కుమార్ అలియాస్ బినోద్ పాత్రలో ఆపర్ శక్తి ఖురానా అద్భుతంగా నటించారు. బెంగాలీ నటుడు ప్రసూన్ జీత్ ఛటర్జీ నటనలో ఓ పవర్ ఉంది. సిదాంత్ గుప్తాకు స్టార్ అయ్యే అవకాశం ఉంది. హ్యాండ్సమ్ గా ఉన్నారు. అలాగే, చక్కగా నటించారు. రామ్ కపూర్ సహా మిగతా ఆర్టిస్టులు క్యారెక్టర్లకు తగ్గట్టు చేశారు.
Also Read : 'రావణాసుర' రివ్యూ : మాస్ మహారాజా రవితేజ విలనిజం బావున్నా... ఎక్కడ తేడా కొట్టిందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'జూబ్లీ' వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తీరు బావుంది. కాస్త నెమ్మదిగా అయినా సరే ఆసక్తిగా కథలోకి తీసుకు వెళ్లారు. ఎలా ముగిస్తారు? అనేది చూడాలి. ప్రేమ, మోసం, బానిసత్వం, స్వార్థం... అంతర్లీనంగా చాలా అంశాలను ఆయా పాత్రల్లో చూపించారు. సినిమాల తరహాలో రేసీగా ఉంటుందని ఆశించవద్దు. ఇదొక విజువల్ పోయెట్రీ. పీరియాడిక్ డ్రామాలు నచ్చే ప్రేక్షకుల కోసమే!
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!